Medigadda Barrage Damage Updates : మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు, పియర్స్ దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని తెలంగాణ సర్కార్‌కు సిఫార్సు చేసినట్లు తెలిసింది. నిర్మాణసంస్థ ఎల్‌అండ్‌టీతో పాటు ఇటీవల కాళేశ్వరం (రామగుండం) ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా తొలగించిన వెంకటేశ్వర్లుపై కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. సీఐడీ ద్వారా కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
Three Cases on Medigadda Incident :గత ఈఎన్సీ వెంకటేశ్వర్లు (ENC Venkateshwarlu) మేడిగడ్డ పని పూర్తికాకముందే పూర్తయినట్లు, డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ ప్రారంభమైందని, బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలని సిఫార్సు చేశారు. దీనివల్ల బ్యారేజీకి నష్టం వాటిల్లినపుడు గుత్తేదారు మరమ్మతులు చేయకపోయినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఈఎన్సీ రాసిన ఈ లేఖ ఆధారంగా రూ.150 కోట్ల బ్యాంకు గ్యారంటీలను విడుదల చేశారని, తర్వాత తమను తప్పుదోవ పట్టించారంటూ ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్) నోటీసు ఇవ్వడాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలిసింది.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్దఎత్తున లోపాలు - విజిలెన్స్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు
పని పూర్తిచేయకుండానే పూర్తయినట్లుగా ధ్రువీకరణ పత్రం తీసుకోవడం పని పూర్తయి డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ ప్రారంభమైందని అప్పటి ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఉన్నతాధికారులకు నివేదించారని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. అయినా కింది ఇంజినీర్లకు ఈ సమాచారం ఇవ్వకపోవడంతో వారు బ్యారేజీలో దెబ్బతిన్న పనులను బాగుచేయాలంటూ లేఖలు రాయడం గురించి కూడా వివరంగా పేర్కొంది. కాఫర్ డ్యాం (Medigadda Barrage) నిర్మాణం చేపట్టి ఆనకట్ట నిర్మాణం తర్వాత వాటిని తొలగించాల్సి ఉన్నా తొలగించకుండా వదిలేశారని తెలిపింది. దీనివల్ల ప్రవాహంలో వచ్చిన మార్పుతో జరిగిన నష్టం, అంచనాలోనే కాఫర్ డ్యాం నిర్మాణానికి, తొలగించడానికి అయ్యే వ్యయం ఉన్నా, తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపైన కూడా మరో కేసు నమోదు చేయాలని విజిలెన్స్ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది.
ఆనకట్ట ఎగువ భాగంలో ఇసుకను ఓ మట్టానికి తేవడం, సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవడం వంటివి చేయకుండా వదిలిపెట్టడం గురించి విజిలెన్స్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గుత్తేదారు చేసిన పనిని ఎం.బుక్‌లో రికార్డు చేయడం, దీని ఆధారంగా బిల్లు చెల్లించడానికి పే అండ్ ఎకౌంట్స్ (పీఏవో)కు సిఫార్సు చేయడం, పీఏవో బిల్లు చెల్లించడం జరుగుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎం.బుక్స్ ఇమ్మని కోరగా, సంబంధిత ఇంజినీర్ వీటికోసం గుత్తేదారుకు లేఖ రాశారు.