Medigadda Barrage Damage Issue Update : మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ- ఎన్డీఎస్ఏ అధికారుల బృందం ఈ వారంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రస్థాయి డ్యాం సేఫ్టీ బృందం ఇవాళ బ్యారేజీలను పరిశీలించనున్నట్లు సమాచారం. అందులో సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్‌కి చెందిన శాస్త్రవేత్తలతో పాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగడంతో పాటు పియర్స్‌కి బీటలువారగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సీపేజీ సమస్య ఎదుర్కొంటున్నాయి.
Annaram BarrageDamage Issue : అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీ గుర్తించగా సుందిళ్ల బ్యారేజీలోనూ గుర్తించి కెమికల్ గ్రౌటింగ్ చేశారు. శాశ్వత చర్యలు చేపట్టేందుకు డిజైన్‌లో లోపం ఉందా? డిజైన్ ప్రకారమే నిర్మాణం జరిగిందా? లేదా? నాణ్యత లోపించిందా? ఇసుక ఎక్కువగా మేటవేస్తున్నందున ప్రవాహంలో మార్పువచ్చి సమస్య ఏర్పడిందా అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకోసం త్వరలోనే నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి
మేడిగడ్డతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించి బ్యారేజీల భద్రతపై నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ నెల 13న ఎన్డీఎస్ఏ ఛైర్మన్, కేంద్ర జల సంఘం ఛైర్మన్‌కు లేఖ రాశారు. మూడు డ్యాంల భద్రతపై ఎన్డీఎస్ఏ(NDSP Team Visit) ధ్రువీకరించాకే తదుపరి చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ఆ కమిటీ అభిప్రాయాలు, సిఫార్సులు కీలకం కానున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో రెండు బ్లాక్‌ల పరిధిలో విచారణ ఇప్పటికే పూర్తి కాగా మరో బ్లాక్‌లో చేయిస్తున్నట్లు తెలిసింది.