Medaram Jatara Bangaram Online :ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా ప్రసిద్ధిపొందిన మేడారం(Medaram Jatara) సమ్మక సారక్క జాతర త్వరలో ప్రారంభం కాబోతుంది. రెండు సంవత్సారాలకోసారి జరిగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే గాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవార్లకు ప్రీతిపాత్రంగా భావించే బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
Medaram Jatara Online Services : అయితే ఈసారీ మేడారం జాతరకు వెళ్లడానికి మీకు వీలు కుదరడం లేదా? అమ్మవారికి బాకీ ఉన్న మొక్కులు ఎలా చెల్లించాలని అలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. కేవలం మీరు 'మీసేవ' కేంద్రాల్లో బుక్ చేసుకుంటే చాలు నామామాత్రపు ఛార్జీతో దేవస్థానమే మీ మొక్కులు చెల్లిస్తుంది. ఈ సర్వీసును సచివాలయంలో ఈరోజు మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ప్రారంభించారు. మీసేవ వెబ్సైట్ ద్వారా తన మనవడు కొండా మురళీకృష్ణ పేరిట నిలువెత్తు బంగారం సమర్పణకు బుక్ చేశారు.
మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు - 6 వేల ప్రత్యేక బస్సులు
బరువును బట్టి కిలోకు 60 రూపాయలు చెల్లిస్తే నిలువెత్తు బెల్లం అమ్మవారి గద్దెల వద్ద మీ పేరిట దేవస్థానం వారు సమర్పిస్తారు. అమ్మవారి ప్రసాదం కోసం పోస్టాఫీసులు, మీసేవ కేంద్రాలు, టీయాప్ ఫోలియో యాప్ ద్వారా డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా ప్రసాదాన్ని మీకు పంపిస్తారు. టీయాప్తో పాటు రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీసేవ కేంద్రాలు, దేశంలోని సుమారు లక్షన్నర పోస్టాఫీసుల ద్వారా పోస్టల్ కేంద్రాలు ఈ సేవలను అందిస్తాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు.