Massive Explosion in Jubilee Hills :హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-9లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో కంప్రెసర్ పేలడంతో ప్రహరీ కూలిపోయింది. రాళ్లు ఎగిరిపడి పక్కనే ఉన్న దుర్గాభవానీ నగర్ బస్తీలో పడటంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాళ్లు తగిలి ఓ యువతికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్తీ వాసులు నిద్రపోతుండటంతో తీవ్రత తగ్గినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై క్లూస్ టీమ్, బాంబ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లో తెలంగాణ స్పైస్ కిచెన్ పేరుతో హోటల్ ఉంది. ఆదివారం ఉదయం అందులోని ఫ్రిజ్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి ప్రహరీ ధ్వంసమైంది. దీంతో రాళ్లు ఎగిరి 100 మీటర్ల దూరంలోని దుర్గాభవానీ నగర్ బస్తీలో పడ్డాయి. దీంతో 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఓ మహిళకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి హోటల్ నిర్వాహకులతో మాట్లాడారు. మరోవైపు హోటల్ నిర్వాహకులు మీడియాను లోపలికి అనుమతించడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. హోటల్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తనకు తెలియదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ధ్వంసమయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ఇళ్లు నష్టపోయిన బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.