Sabala Millets Exhibition at Manikonda : చిన్న వయసు నుంచే డబ్బును పొదుపు చేయడం నేర్చుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను అవలీలగా దాటొచ్చని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు. హైదరాబాద్ మణికొండలోని ల్యాంకోహిల్స్లో రామోజీ గ్రూప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ల్యాంకోహిల్స్ వాసులు పాల్గొన్నారు. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు ఘనస్వాగతం పలికారు. హుషారైన సంగీతం ఆకట్టుకోగా అందుకు తగ్గట్టుగా చిన్నాపెద్దా నృత్యాలు చేస్తూ అలరించారు. సినీనటులు శివబాలాజీ దంపతులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర సంబరాల్లో భాగంగా రామోజీ గ్రూప్స్ ఆధ్వర్యంలో జరిగిన సబల గుడ్నెస్ ఆఫ్ మిల్లెట్స్ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు విశేష స్పందన లభించింది. సబల మిల్లెట్స్ స్టాల్‌ను శైలజాకిరణ్ సందర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో 121 బ్రాంచిలతో 60లక్షల మందికి సేవలు అందించినట్లు శైలజాకిరణ్ తెలిపారు. ఈ ఏడాది రూ.14వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
"1962లో రామోజీరావు గారి చేతుల మీదుగా మార్గదర్శి ప్రారంభమైందని మీ అందరికీ తెలుసు. పద్ధతులు, విలువలను పాటిస్తూ సంస్థను నడిపారు. అందువల్లే మార్గదర్శి ఆర్థిక స్థిరత్వంతో నిలబడింది. నీతి, నిజాయతీ, నిబద్ధత, జవాబుదారీతనం వల్లే ఇదంతా సాధ్యమైంది. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్గదర్శి అనేక మందికి ఇంటి పేరుగా మారింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ విస్తరించాం. చిన్నప్పటి నుంచే పొదుపు చేయాలని నా సలహా. వయసు పైబడినప్పుడు పెద్ద ఖర్చులు ఎదురై చాలా ఆలస్యమవుతుంది. అందరూ 2025లో మార్గదర్శిలో చేరుతారని ఆశిస్తున్నా. దేశ ప్రజలకు నాణ్యమైన మిల్లెట్స్ ను అందించడమే రామోజీరావుగారి చివరి కోరిక."- శైలజాకిరణ్, మార్గదర్శి ఎండీ