Lack Of Facilities In ZPHS Malchelma: ఆటపాటలతో కలకలలాడాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు ఎటుచూసినా చెత్తాచెదారం, చుట్టూ ముళ్లపొదలతో దర్శనమిస్తోంది. శిథిలావస్థకు చేరిన ఆ పాఠశాల కాస్త పాడుబడ్డశాలగా దర్శనమిస్తోంది. రెండేళ్లక్రితం వరకూ అన్ని హంగులతో ముచ్చటగొలిపిన ఆ చిన్నారులగుడి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని మల్చల్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ విద్యకు అవకాశం ఉంది.
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు :గత రెండేళ్ల నుంచి పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో హాస్టల్ గదుల్లోనే ఉదయం 1 నుంచి 5 వ తరగతి వరకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. మధ్యాహ్నం ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠాలు చెబుతుండటటం వల్ల చదువులకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల కూలిపోయే ప్రమాదం ఉండటంతో విధిలేక వసతిగృహంలోనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ప్రత్యేకించి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మాద్యమాలు ఉన్నా వాటి తరగతులు నిర్వహించేందుకు గదులు లేవని చెబుతున్నారు.
"ఈ పాఠశాల మొత్తం శిథిలావస్థలో ఉంది. మాకు తాత్కాలికంగా ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి వసతి హాస్టల్‌లో సౌకర్యం కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ కూడా తరగతులు నిర్వహించడానికి అనుకూలంగా లేవు. మొత్తం పది తరగతులు ఉన్నాయి. కనీసం ఐదు తరగతులు కూడా నిర్వహించలేకపోతున్నాము. అధికారులు స్పందించి పాఠశాలకు భవానాన్ని మంజూరు చేయాలని కోరుతున్నాం" - అనిత, ప్రధానోపాధ్యాయురాలు