Low Pressure Area over Bay of Bengal :బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ సంవత్సరం నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ అల్పపీడనాలు అధికంగా ఏర్పడుతున్నాయి. అక్టోబరు నుంచి డిసెంబర్ కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సాధారణంగా పోర్ట్‌బ్లెయిర్ సమీపంలో ఉంటే ఇంటర్, ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ తరచూ అల్పపీడనాలను ఉత్పత్తి చేస్తుంది. గతంలో అవి ఏర్పడిన వెంటనే బలహీనపడేవి. ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తీవ్రరూపం దాల్చుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి కొనసాగుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
మారుతున్న గమనం : సాధారణంగా అక్టోబరు, నవంబరు 15 మధ్యలో ఏర్పడే అల్పపీడనాలు ఒడిశా, ఉత్తర కోస్తా మధ్యలో తీరాన్ని తాకుతాయి. నవంబరు తర్వాత ఏర్పడితే మచిలీపట్నం, ఒంగోలు డిసెంబరులో అయితే తమిళనాడులో తీరం దాటుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి గమనం అసాధారణంగా ఉంది. 2023లో ఏర్పడిన తుపాన్లన్నీ గమనం మార్చుకున్నాయి. గత సంవత్సరం డిసెంబరులో ఏర్పడిన మిగ్‌జాం తీవ్ర తుపాను తీరం వైపు కదిలే క్రమంలో రెండుసార్లు దిశ మార్చుకుంది.
తమిళనాడులో తీరం దాటాల్సిన తుపాను ఏపీలోని బాపట్ల సమీపంలో తీరంపైకి వచ్చింది. ఈ సీజన్‌లో మొదట అక్టోబరులో ఏర్పడిన వాయుగుండం చెన్నైలో తీరం దాటింది. 1965-2022 కాలంలో గణాంకాలను చూస్తే ఉత్తర హిందూ మహాసముద్రం (అరేబియా సముద్రం, బంగాళాఖాతం)లో సంవత్సరానికి సగటున 12 అల్పపీడనాలు (సైక్లోన్ డిస్టర్‌బెన్స్) ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది బంగాళాఖాతంలోనే 14 అల్పపీడనాలు ఏర్పడ్డాయి.
ఉష్ణోగ్రతలు పెరగడంతో : ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో తటస్థంగా ఉంది. వాతావరణ మార్పులతో హిందూ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. పరిసర దేశాల్లో పారిశ్రామికీకరణ, జనాభా ఎక్కువ ఉండటంతో కాలుష్యం ఎక్కువవుతుంది. అక్టోబరులో ఎస్‌ఎస్‌టీ 28.5 డిగ్రీలుంటే, నవంబరులో మరింత పెరుగుతుంది.