Loan App Harassments in Telangana :క్షణాల్లో లోన్‌ను పొందొచ్చని సెల్‌ఫోన్‌కు సాధారణ సందేశం ద్వారా లేదా వాట్సాప్‌నకు సమాచారం పంపించి ఆశ చూపిస్తారు. ఒక్క లింక్‌ను క్లిక్ చేస్తే చాలు ఎలాంటి ఫ్రూప్‌లు లేకుండా తక్షణమే రుణం వస్తుందంటారు. ఆ లింక్‌పై క్లిక్ చేశారా ఇక అంతే సంగతులు. వారి ఉచ్చులో పడినట్లే. చేతికొచ్చిన నగదు ఖర్చయ్యేలోపే యాప్ నిర్వాహకుల నుంచి ఫోన్ల మోత మోగుతుంది. వారం రోజులు తిరిగేలోపు మీరు తీసుకున్న లోన్‌కు ఇంత వడ్డీ అని ఫోన్లు చేస్తారు. చెల్లిస్తామని చెప్పినా ఆ కాల్స్ మాత్రం ఆగవు. ఒకరి తరవాత వేరొకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. అసభ్యకరంగా, దురుసుగా మాట్లాడతారు. మళ్లీ ఆ నంబరుకు కాల్ చేస్తే కనెక్ట్ అవ్వదు. రోజూ కొత్త కొత్త నంబర్లతో తిప్పలు ఇంతకింతకు పెరుగుతాయి. బాధను భరించలేక ఒక వేళ కొంత మొత్తం చెల్లించినా మళ్లీ అదే కథ!
అధిక వడ్డీలకు :లోన్ యాప్‌ల వడ్డీ అడ్డూ అదుపు లేకుండా ఉంటుంది. రూ.7 వేలు తీసుకున్న బాధితుడికి పది రోజుల్లోనే రూ.12 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తారు. అసలుకన్నా వడ్డీ దాదాపుగా రెట్టింపు వసూలు చేస్తారు. వాస్తవానికి జాతీయ బ్యాంకులతో పాటు ఇతర కార్పొరేట్ బ్యాంక్‌లు సిబిల్ స్కోర్‌ను బట్టి 8 శాతం నుంచి 14శాతం వడ్డీతో లోన్‌ను అందిస్తాయి. పక్కాగా కిస్తీలు(ఈఎంఐ) చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. వాటిని కాదని ఒక్కసారి ఈ రుణ యాప్ ముగ్గులోకి దిగితే మాత్రం బయటపడటం కష్టమే!
లోన్‌యాప్‌ల నిర్వాహకుల వేధింపులు :లోన్‌యాప్‌ల దారుణానికి కరీంనగర్‌కు చెందిన సతీశ్ రెడ్డి గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఆయన సెల్‌ఫోన్‌కు రుణయాప్‌ల నిర్వాహకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. జనరల్ ఆస్పత్రిలో మరణోత్తర పరీక్షల(శవపరీక్షల) కోసం వేచి ఉన్న అతని బంధువులు ‘మీ బాధ తాళలేక సతీశ్ చనిపోయాడని చెప్పినప్పటికీ అదంతా తమకు తెలియదు పైసలు కట్టాలి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. చివరకు మృతదేహం ఫొటోలను పంపించినా వారి బెదిరింపుల ఫోన్ కాల్స్ ఆగలేదంటే వారి ఆగడాలు, వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
వికృత చేష్టలకు అడ్డూ అదుపూ ఉండదు
- లోన్ మంజూరు చేసే సమయంలో మనం యాప్‌లో నమోదు ప్రారంభించగానే చరవాణిలోని సమాచారం అంటే మన కాంటాక్ట్ లిస్ట్, చిత్రాలు వాళ్ల ఆధీనంలోకి వెళ్తాయి.
- వారడిగినట్లుగా డబ్బు చెల్లించకపోతే మొదట దగ్గరి బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి లోన్ చెల్లించడం లేదని చెబుతారు.
- రెండో దశలో హెచ్చరికలో భాగంగా లోన్ తీసుకున్న వ్యక్తి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అతడికి వాట్సాప్ చేస్తారు.
- ఫోన్‌లోని ఇతర ఫొటోలను మార్ఫింగ్ చేస్తామని బెదిరిస్తారు.
- సెల్ఫోన్లో ఉన్న మహిళల నంబర్లకు అశ్లీల చిత్రాలను పంపిస్తామని హెచ్చరిస్తుంటారు.
- అసలు తీసుకున్న లోన్‌తో సంబంధం లేకుండా వాళ్లడిగినంత ఇచ్చినప్పటికీ ఇంకా కావాలని వేధిస్తారు.
- ఫోన్ ముట్టడానికే భయపడే విధంగా మాటల దాడిని పెంచుతారు. చివరకు జీవితంపై విరక్తి వచ్చే విధంగా చేస్తారు.
స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష
- ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్లో అనవసరమైన లింక్‌లపై క్లిక్ చేసి మోసపోవద్దు.
- ఎంతటి ఆర్థిక అవసరమైనా యాప్‌లలో లోన్ తీసుకోవద్దని దృఢ నిర్ణయం తీసుకోవాలి.
- తల్లిదండ్రులకు తెలియకుండా యాప్‌ల రుణాలను ఆశ్రయిస్తున్న యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
- ఒకవేళ లోన్యాప్లో ఇప్పటికే తీసుకున్న బాధితులు ఉంటే ఈ వ్యథ నుంచి తప్పించుకునేందుకు 1930 సహాయక నంబరుకు ఫిర్యాదు చేయాలి. వారిచ్చే సూచనలతో సంబంధిత పోలీసులను సంప్రదించాలి.