Cockroach Found in Biryani In Alwal Hyderabad : బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కుండ బిర్యానీ, దమ్ బిర్యానీ నచ్చిన హోటళ్లకు వెళ్లి ఎంచక్కా లాగించేస్తుంటారు. కానీ ఈ మధ్య కొన్ని హోటళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలను వాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చికెన్ బిర్యానీలో కప్ప, పురుగులు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా నిత్యం కల్తీ ఆహారాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హోటల్లో బిర్యానీలో బొద్దింక దర్శనం ఇవ్వగా, భోజనప్రియులు కంగుతిన్నారు.
సికింద్రాబాద్ అల్వాల్‌లోని ఓ హోటల్‌లో బిర్యానీ తినడానికి వెళ్లిన వినియోగదారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బిర్యానీ తింటున్న సమయంలో ప్లేట్లో బొద్దింక ప్రత్యక్షం కావడంతో హోటల్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారంలో సరైన నాణ్యత లేకపోవడం, కిచెన్‌లో సరైన శుభ్రత లేకపోవడంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. వంట గదిలోని ఫ్రిజ్‌లో బూజు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నాయని తెలిపారు. ఆహార భద్రత అధికారులు వెంటనే అపరిశుభ్రమైన ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోటల్లో ఆహారం తినాలంటే భయమేస్తుందని పేర్కొన్నారు.
" బిర్యానీ తినడానికి ఈ హోటల్‌కి వచ్చాము. బిర్యానీ తిందామని చూస్తే అందులో బొద్దింక, పురుగులు ఉన్నాయి. వంట గదిలోని ఫ్రిజ్ తెరచి చూస్తే బూజు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇదే విషయమై అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు. ఈ హోటల్ యాజమాన్య నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలి." - వినియోగదారుడు
చికెన్ బిర్యానీలో కప్ప - కంగుతిన్న గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు