Tips for Good Sleep at Night: ప్రస్తుత ఆధునిక జీవితంలో వివిధ కారణాల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఇంకా అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ప్రశాంతంగా నిద్ర పోవడం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందుకే రాత్రుళ్లు నిద్రపోయే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సుఖంగా నిద్ర పడుతుందని అంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకుందాం రండి.
అరటిపండు స్మూతీ: సాధారణంగా మనకు నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి మెగ్నీషియం లోపం కూడా ఓ కారణమేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నిద్రకు ఉపక్రమించడానికి ముందు మెగ్నీషియం పుష్కలంగా ఉండే అరటిపండు స్మూతీని తీసుకోవడం వల్ల సుఖంగా నిద్ర పడుతుందని అంటున్నారు. Journal of Clinical Sleep Medicineలో ప్రచురితమైన The Effects of Banana Extract on Sleep Quality in Healthy Adults: A Randomized, Double-Blind, Placebo-Controlled Trial అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఎలా చేసుకోవాలి?
దీనికోసం ఒక అరటిపండు, రెండు చెంచాల ఆల్మండ్ బటర్, కప్పు పాలు మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకొని నేరుగా తాగేయచ్చు. ఇంకాస్త తియ్యదనం కావాలంటే ఇందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చట. అరటిపండు, ఆల్మండ్ బటర్‌లో ఉండే మెగ్నీషియం.. కేవలం ప్రశాంతమైన నిద్రకే కాకుండా.. కండర, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుందన్నారు.
పాలు, తేనె: పాలు, తేనె వల్ల కూడా సుఖమైన నిద్ర కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వేడి పాలలో కొద్దిగా వెనీలా ఎసెన్స్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలని అంటున్నారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు కొద్దికొద్దిగా సిప్ చేయాలట. ఫలితంగా పాలల్లో ఉండే అమైనో ఆమ్లాలు శరీరంలోకి ప్రవేశించిన సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తాయన్నారు. ఫలితంగా నిద్ర బాగా పట్టడమే కాకుండా.. అలాగే వెనీలా ఎసెన్స్ మెదడుని ప్రశాంతంగా ఉంచుతుందన్నారు. ఇక తేనె కూడా నిద్రకు ఉపకరించే హార్మోన్లు విడుదలయ్యేందుకు దోహదం చేస్తుందని వివరించారు.
చామొమైల్ టీ: చామొమైల్ టీ తాగడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో దొరికే చామొమైల్ టీ బ్యాగ్స్‌ని వేడి నీటిలో వేసుకోవడం ద్వారా చామొమైల్ టీని సులభంగా తయారు చేసుకోవచ్చని అంటున్నారు. దీనిని నిద్ర పోవడానికి ముందు తాగడం వల్ల చక్కని నిద్ర సొంతమవుతుందని వివరించారు.
బాదం పాలు: ఇంకా ఒక కప్పు బాదం పాలు తీసుకొని అందులో చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా అల్లం వేసి వేడిచేసుకోవాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక అందులో కొద్దిగా తేనె వేసి కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు తాగితే హాయిగా నిద్రలోకి జారుకోవచ్చని చెబుతున్నారు.
చెర్రీ జ్యూస్: ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో ఒక గ్లాసు చెర్రీ జ్యూస్ తాగడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే మెలటోనిన్ అనే పదార్థమే ఇందుకు కారణమని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ప్రతి రోజు భోజనంలో పెరుగు తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
కూరల్లో పసుపు వేస్తున్నారా? అతిగా వాడితే అనేక వ్యాధులు వస్తాయట జాగ్రత్త! మరి ఎంత వేయాలి?