Decomposed Bodies Of Father And Daughter : తమిళనాడు చెన్నైలోని ఓ అపార్ట్మెంట్లో కుళ్లిపోయిన స్థితిలో తండ్రీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఓ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
వేళూరు జిల్లాకు చెందిన సామ్యూల్ శంకర్(70) గత కొంత కాలంగా మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో చికిత్స కోసం గతేడాది ఫిబ్రవరిలో తన కూతురు సింథియా (37)తో కలిసి ఆవడి సమీపంలోని తిరుముల్లైవాయల్‌కు వచ్చాడు. అక్కడ శామ్యూల్ ఎబినేజర్ అనే వైద్యుడు శంకర్‌కు వైద్యం చేసేవాడు. మాటిమాటికి ఆస్పత్రికి రావాల్సి ఉండడం వల్ల శంకర్, ఆయన కూతురి సింథియాను తన ప్రైవేట్ అపార్ట్మెంట్లో ఉండడమని వైద్యుడు శామ్యూల్ సూచించాడు. ఈ క్రమంలో వారిద్దరూ శామ్యూల్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో ఉన్నారు.
చికిత్స పొందుతూ తండ్రి మృతి- కుమార్తెతో వాగ్వాదం
చికిత్స పొందుతూ శంకర్ గతేడాది సెప్టెంబరులో మృతి చెందాడు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ఆయన కుమార్తె సింథియా వైద్యుడు శామ్యూల్‌తో వాగ్వాదానికి దిగింది. ఇరువురి మధ్య గొడవ పెరిగి సింథియా తలపై శామ్యూల్ బలంగా కొట్టాడు. దీంతో ఆమె మరణించింది. ఆందోళన చెందిన శామ్యూల్ ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన కాంచీపురం వెళ్లిపోయాడు.
వారానికి రెండుసార్లు వచ్చి ఏసీ ఆన్
ఆ తర్వాత శంకర్, సింథియా మృతదేహాలు ఉన్న ఇంటికి వారానికి రెండు సార్లు వచ్చేవాడు శామ్యూల్. వారి మృతదేహాల నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లోని ఏసీని స్విచ్ ఆన్ చేసి వెళ్లేవాడు. తాను హత్య చేసిన విషయం తెలిస్తే ఇటీవల గుండె శస్త్రచికిత్స జరిగిన తన తల్లి ఆరోగ్యం ఏమవుతుందోనని ఆందోళన చెందాడు. అందుకే హత్యల విషయం ఎవరికి తెలియకుండా ఐదు నెలలుగా దాస్తున్నాడు.
ఇంటి నుంచి దుర్వాసన- బయటపడిన అసలు విషయం
శంకర్, సింథియా మృతదేహాల ఉన్న అపార్ట్మెంట్ నుంచి బుధవారం రాత్రి దుర్వాసన వచ్చింది. వెంటనే ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా రెండు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వెంటనే ఆ రెండు డెడ్ బాడీలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల కోసం కల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ దిగ్భ్రాంతికర ఘటనకు సంబంధించి డాక్టర్ శామ్యూల్ ఎబినేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స విఫలం కావడం వల్లే శంకర్ మృతి చెందాడని పోలీసుల విచారణలో తేలింది. అలాగే శంకర్ కుమార్తెను శామ్యూల్ కొట్టడం వల్లే ఆమె మరణించనట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు శామ్యూల్‌పై హత్య, సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబత్తూరు కోర్టులో హాజరుపరిచి పుఝల్ జైలుకు తరలించారు.