How to Increase Child Concentration: ప్రస్తుత ఆధునిక సమాజంలో సెల్‌ఫోన్ మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతాఇంతా కాదు. ముఖ్యంగా ఈ కాలం పిల్లలు నలుగురిలో ఉన్నా సెల్‌ఫోన్‌లో తలదూర్చి దాంతోనే కాలం గడుపుతున్నారు. ఈ వ్యసనం వారి ఏకాగ్రతను దెబ్బతీసి నైపుణ్యాలకు ఎసరు పెడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా పరధ్యానాన్ని పెంచుతోందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లల ఏకాగ్రత పెంచడమెలా అన్న ప్రశ్నకు ప్రముఖ పిల్లల సైకియాట్రిస్టు డాక్టర్ గౌరీదేవి వెల్లడిస్తున్నారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల మానసిక ఎదుగుదలకు, భావోద్వేగ నియంత్రణకు ఏకాగ్రత చాలా కీలకమని చెబుతున్నారు. తదేక దృష్టితోనే కొత్త విషయాలు నేర్చుకోని జ్ఞాపకశక్తీని పెంచుకుంటారని తెలిపారు. ఈ డిజిటల్ యుగంలో పిల్లల ఏకాగ్రతను పెంచేందుకు తల్లిదండ్రులే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారు సెల్‌ఫోన్లు వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, స్క్రీన్‌టైంను నియంత్రించాలని వివరిస్తున్నారు.
"పోమోడోర్ టెక్నిక్ అనేది సమయ నిర్వహణ పద్ధతిని 1980ల్లో అభివృద్ధి చేశారు. ఏకాగ్రత స్థాయిలను పెంచడంలో ఇది చాలా దోహదపడుతుంది. ఈ ప్రక్రియలో సాధారణంగా 25 నిమిషాల వ్యవధిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు 25 నిమిషాలపాటు టైమ్ సెట్ చేసుకొని అధ్యయనం చేస్తారు. ఆ సమయం ముగియగానే 5-10 నిమిషాలపాటు విరామం తీసుకొని మళ్లీ 25 నిమిషాలపాటు చదువుతారు. ఇలా నాలుగు దఫాలుగా చేసిన అనంతరం 20-30 నిమిషాలపాటు విరామం తీసుకోవడం ద్వారా ఏకాగ్రతతో అధ్యయనం చేయవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నిక్‌ను చాలా ప్రదేశాల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు."
--డాక్టర్ గౌరీదేవి, పిల్లల సైకియాట్రిస్టు
- ముఖ్యంగా వేళాపాళా లేని తిండి, నిద్రలాంటివి పిల్లల్లో ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. అందుకే వారికి క్రమబద్ధమైన షెడ్యూల్ చాలా అవసరం ఉంటుంది. చదువుకోవడం, ఆడుకోవడం, ఆహారం తీసుకోవడం, పడుకోవడం ఇలా అన్ని పనులు సకాలంలో జరిగేలా చూడాలి. ఇలా చేస్తే అది పిల్లల్లో సమయపాలన, ఏకాగ్రతను పెంచి వారి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది.
- చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లలు చదువుతుండగానే టీవీ చూస్తుంటారు. లేదంటే పెద్దగా ఫోన్‌లో ఇతరులతో మాట్లాడుతుంటారు. ఇలాంటివి పిల్లలనూ నష్టపరిచి.. వారూ డిజిటల్, స్క్రీన్‌లవైపు మళ్లేలా ప్రేరేపిస్తుంది. అందుకే ఇంట్లో సరైన వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది.
- చాలామంది అదే పనిగా పిల్లలను చదవాలని ఒత్తిడి చేస్తుంటారు. సెలవు రోజుల్లో అయితే పుస్తకాలు తీసి చదవాలని చెబుతుంటారు. వాస్తవానికి చదువు మధ్యలో కొంత సమయం విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మరింత ఏకాగ్రతకు పెరిగి.. మానసిక అలసటను నివారిస్తుంది.
- ఏకాగ్రత పెంచడంలో ఆహారానిది కీలక పాత్రని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, పండ్లు, ఆకుకూరలు, మాంసకృత్తులు, చేపలు, నట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని అంటున్నారు.
- పిల్లలు ఫోన్లు, ట్యాబ్, టీవీలు చూసే సమయాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయం వారికి అర్థమయ్యేలా వివరించాలి. డిజిటల్‌కు అలవాటు పడితే ఏకాగ్రత తగ్గుతుంది. అందుకే వీటిని తగ్గించేసి మెదడు చురుకుతనం పెంచే కార్యకలాపాల వైపు మళ్లించాలి. పుస్తకాలు చదివించడం, చిత్రలేఖనం, ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ముఖ్యంగా భోజనం, నిద్రకు ముందు ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లలను దూరంగా ఉంచాలని సలహా ఇస్తున్నారు.
- పిల్లల చదువు కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక గది ఏర్పాటు చేస్తే మంచిది. సరైన ఎత్తులో టేబుల్, కుర్చీ, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నేలపై, సోఫాలు, మంచాలపై కూర్చొని ఎక్కువ సేపు చదవలేక.. కొంతసేపటికే ఏకాగ్రత కోల్పోతారు. అందుకే గదిలో కూడా చదువుకునేందుకు ప్రేరణ కల్పించేలా సూక్తులు, మంచి చిత్రాలతో అలంకరించాలని అంటున్నారు.
- బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో పిల్లలు ఉంటే వాళ్ల ఇంటికి పంపించి వారితో కలిసి చదువుకునేలా చేయవచ్చు. అవతలి పిల్లలు బాగా చదివేవారైతే మన పిల్లలూ మోటివేట్ అవుతారు. ఇంకా బాగా చదువుకున్న వారికి ప్రోత్సాహం కింద టోకెన్లు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. నెలకోసారి ఆ టోకెన్లు తీసుకొని వాటికి సమానమైన డబ్బులు కేటాయించి వారి హాబీలకు ఇతర అవసరాలకు వాడుకునేలా చూడటం వల్ల పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
టమాటా, వెల్లుల్లి, బ్రెడ్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా? వేటిని ఇందులో పెట్టకూడదో తెలుసా?
గోడలపై గీతలు, ఫర్నీచర్‌పై మరకలు మొత్తం పోతాయ్! హోమ్ క్లీనింగ్‌కు సూపర్ టిప్స్!!