Leopards Wander in Telangana :ఇటీవల వన్యప్రాణాలు జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవులను నరికి, కొండలను కూల్చేస్తుండటంతో ఆవాసాలు లేక వన్యప్రాణాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలుచోట్లు ప్రజలు, పశువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చిరుత, పెద్దపులి, ఎలుగుబంటి సంచారం, దాడులు ఎక్కుకవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనలే నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Leopard Chases Goatherd in Nirmal : నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సారంగపూర్ మండలం రవీంద్రనగర్ సమీపంలో సహ్యాద్రి కొండల వద్ద ఓ వ్యక్తి మేకలను కాసేందుకు వెళ్లాడు. మేకలు మేత మేస్తుండగా అతడు ఓ చెట్టు వద్ద కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత అతని వైపు రావడం మొదలుపెట్టింది. గమనించిన మేకల కాపరి కేకలు వేస్తూ వెంటనే చెట్టెక్కాడు. అతడు బిగ్గరగా కేకలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అయితే అంతకంటే ముందే ఆ క్రూరమృగం రెండు మేకలను చంపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.