Layout Regularization Scheme in Telangana : తెలంగాణలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది గత మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైచిలుకు దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయమై తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ విధానం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.
Illegal Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లు.. అనధికార వసూళ్లు!!
Telangana LRS Scheme 2024 : రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిభట్టివిక్రమార్కఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై త్వరలో స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ పథకాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తే ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు సైతం ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి
Layout Regularization Scheme : దరఖాస్తుల పరిశీలనకు న్యాయస్థానాల నుంచి అప్పట్లో అనుమతి లభించడంతో క్షేత్రస్థాయి పరిశీలనను అధికారులు పూర్తిచేశారు. ఆ ప్రక్రియను మూడు దశల్లో చేపట్టారు. తొలిదశలో దరఖాస్తుల పరిశీలన రెండో దశలో ఆయా స్థలాలు క్రమబద్ధీకరణకు అర్హమైనవా? కాదా? అని గుర్తించడం.. అర్హతలు ఉన్నట్లు భావిస్తే సిఫార్సు చేయడం మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలంటూ నోటీసుల జారీకి అనుమతించడం. ఈ మేరకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.