Lakshminagar Village Birth Day Celebrations : ఎవరో వస్తారు. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, సమిష్టిగా ముందుకు సాగుతూ సత్ఫలితాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ గ్రామం. అక్కడి గ్రామ ప్రజలు నేను, నాది అనే భావన కాకుండా మనం, మనది అనే భావనతో ఏకతాటి మీద నడుస్తూ వివిధ రంగాల్లో స్థిరపడి రాణిస్తున్నారు. వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసుకొని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుపుతున్నారు. ఆ గ్రామమే మెదక్ జిల్లాలోని లక్ష్మీనగర్.
ఒకప్పుడు లక్ష్మీనగర్ అనేది అటవీ ప్రాంతం. రాళ్లూ రప్పలతో ఉండేది. ప్రస్తుతం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉంది. 1948-1950 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, గుంటూరు, ఒంగోలు, తెనాలి ప్రాంతాలకు చెందిన 14 కుటుంబాల వారు లక్ష్మీనగర్‌కు తరలివచ్చి అక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో వారు బీడు భూములను కొనుక్కొని వరి సాగు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. 1995 లక్ష్మీనగర్ గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. మొదటి సర్పంచ్‌గా రాజ్యలక్ష్మి ఎన్నికవ్వగా, గ్రామ ప్రజలందరూ చందాలు జమ చేసుకొని స్థలం కొనుగోలు చేసి పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు.
ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 225 కుటుంబాలు 1200 మంది పైచిలుకు జనాభా నివాసం ఉంటుంది. కంటమనేని రత్తయ్య లక్ష్మీ నర్సమ్మ చొరవతో లక్ష్మీనగర్ అనే గ్రామం ఏర్పడింది. ఈ గ్రామానికి చెందిన పెండ్యాల ప్రసాద్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తరచూ గ్రామస్థులతో సమావేశం నిర్వహించి చైతన్య పరిచేవారు. ప్రజలందరి సహకారంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్య, అభివృద్ధితో ఆదర్శ గ్రామంగా తయారు చేయడం లక్ష్యంగా 2014లో 11 మందితో లక్ష్మీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటైంది. గ్రామానికి చెందిన డాక్టర్లు, ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్లు తదితర రంగాలకు చెందిన వారితో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
హరితహారం చేపట్టిన గ్రామం : వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్, మిల్క్ సొసైటీ ఏర్పాటయ్యాయి. అలాగే ప్రగతి భవన్ నిర్మాణాన్ని కూడా చేపట్టారు. విద్యావంతులు, యువకులు క్రియాశీలకంగా పనిచేసే వారితో పరిశుభ్రత, హరితహారం, ఆలయ వేడుకల నిర్వహణ వివిధ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ జామ, అరటి, మామిడి, సపోటా, కొబ్బరి వివిధ రకాల పూల మొక్కలను పెంచుకోవడం విశేషం. అలాగే గ్రామంలో సాధ్యమైనంత వరకు వివిధ కూరగాయలు, ఆకు కూరలను సేంద్రీయ పద్ధతిలో పండించుకుంటున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతున్న ఉద్దేశం కొద్దీ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంతో పాటు మద్యపాన నిషేధం కూడా అమలు చేశారు. అలాగే భూగర్భ జలాలు ఇంకాలని ప్రతి ఒక్క ఇంటికీ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకున్నారు.