Lakawat Rani Softball Player :అడవి బిడ్డగా ప్రయాణం మొదలు పెట్టింది ఈ అమ్మాయి. అనుకోకుండా ఆటల్లోకి అడుగు పెట్టి అనతికాలంలోనే అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించింది. జాతీయ, అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్(Softball) టోర్నమెంట్లలో పాల్గొని పతకాలు సాధిస్తోంది. నైపుణ్యంతో జట్టుకు గెలుపు బాటలు వేస్తూనే, సొంతంగా ఎన్నో అవార్డులను సాధించింది ఈ గిరిజన ఆణిముత్యం. తనకు వచ్చిన పతకాలు, అవార్డులు చూపిస్తున్న ఈ అమ్మాయి పేరు లకావత్ రాణి.
షైనింగ్ స్టార్ త్రిష పూజిత - మహిళల ప్రీమియర్ లీగ్‌లో తెలుగుమ్మాయి హవా
కామారెడ్డి జిల్లాల్లోని మారుమూల ప్రాంతమైన అంకోల్ తాండ స్వస్థలం. తల్లిదండ్రులు మోతీబాయి, దేన్యా నాయక్. వీరికున్న రెండెకరాలలో వ్యవసాయం చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. నాలుగో తరగతి వరకు బొమ్మన్‌దేవ్‌పల్లిలో చదివిన రాణి(Lakawat Rani), ఆపై చదువులు కోసం దగ్గరలోని సుద్దపల్లి గురుకుల పాఠశాలలో చేరింది. చిన్నప్పటి నుంచి చదువుపైనే దృష్టి పెట్టిన రాణి, గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత తోటి విద్యార్థులతో కలిసి ఆటలు ఆడటం మొదలు పెట్టింది.
LAKAWAT RANI WON MEDALS IN SOFTBALL : క్రమంగా సాఫ్ట్‌బాల్‌ను హాబీగా మార్చుకుంది. అయితే వేగంగా నేర్చుకునే తత్వం, అనుకున్నది సాధించే పట్టుదల చిన్నప్పటి నుంచి రాణి సొంతం. అందుకే ఎంచుకున్న సాఫ్ట్‌బాల్‌లో నిరంతర సాధన చేసింది. తన ఆసక్తిని గమనించిన కోచ్ కూడా మెళకువలు నేర్పాడు. ఫలితంగా మంచి క్రీడాకారిణిగా రాణిస్తోంది. సాధారణంగా జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీయస్థాయి పోటీలకు వెళ్తారు.
కానీ, ఈ మట్టిలో మాణిక్యం కథే వేరు. తన నిరంతర సాధన, సాధించాలనే పట్టుదలతో నేరుగా జాతీయ పోటీల్లో అడుగుపెట్టింది. కోచ్ ప్రోత్సాహంతో అనతికాలంలోనే అద్భుత ప్రతిభతో అదరగొట్టింది. టీమ్‌కు విజయాలను అందించడంలో కీలక పాత్ర వహించింది. సాఫ్ట్‌బాల్ పోటీలు ఎక్కడ జరిగినా, అక్కడ తన ఆటతీరుతో ఔరా అనిపిస్తుంది. 2016 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సాఫ్ట్‌బాల్ టోర్నమెంటులో జట్టుకు కాంస్య పతకాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.