L and T on kaleshwaram Work Completion Certification Cancellation :పని పూర్తయినట్లు నిర్ధారించి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పుడు రద్దు చేయడమేంటని మేడిగడ్డ బ్యారేజి నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా చేయడం ఒప్పందానికి విరుద్ధమే కాదు, చట్టప్రకారం కాంట్రాక్టర్ హక్కులను కూడా ఉల్లంఘించడమేనని పేర్కొంది. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు అదీ పని పూర్తయిన 1500 రోజుల తర్వాత ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ)కి లేఖ రాసింది. పని పూర్తయిందని, పెండింగ్ పనులేమీ నోటిఫై చేయకుండా ఇప్పుడు పెండింగ్ పనులున్నాయంటూ అనడాన్ని తప్పపట్టింది.
దీనికి సంబంధించిన నేపథ్యం ఇలా : మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న భాగాలకు మరమ్మతులు చేయాలని కోరినా పట్టించుకోలేదని, కొన్ని పనులు పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉండగానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం అక్రమమని, దాన్ని రద్దు చేయాలంటూ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా లేఖ రాశారు. ఈఎన్సీ నుంచి కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ద్వారా వచ్చిన లేఖ ఆధారంగా సర్టిఫికెట్‌ను రద్దు చేశామని ఒరిజినల్ సర్టిఫికెట్ వెనక్కు ఇవ్వాలని ఎల్‌అండ్‌టీ పీఈఎస్‌కు రామగుండం ఎస్‌ఈ లేఖ రాశారు. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించి, ఎస్‌ఈకి లేఖ రాసింది. గత నెల 18న ఎస్‌ఈ రాసిన లేఖ 24వ తేదీన ఈ-మెయిల్ ద్వారా, 28వ తేదీన పోస్టు ద్వారా అందిందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు కొన్ని అంశాలను మీ దృష్టికి తెస్తున్నామని వ్యాఖ్యానించింది.
ఎల్‌అండ్‌టీ లేఖలోని ముఖ్యాంశాలు
- 2019 సెప్టెంబరు 10న సబ్‌స్టాన్షియల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) జారీ చేయగా బ్యారేజి నిర్మాణం పూర్తయి 2019 జూన్ 21న ప్రారంభోత్సవం జరిగినట్లు ఎస్‌ఈ నిర్ధారించారు. అప్పటి నుంచి ఆనకట్ట నిర్వహణలో ఉంది.
- 2020 నవంబరు 13న అదనపు పనులు సహా అన్నీ పూర్తయ్యాయని రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ధారించి ఒప్పందంలోని క్లాజు 45.2 ప్రకారం రిటెన్షన్ మనీ బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయాలని నిర్ణయించింది.
- 2021 మార్చి 15న అన్ని పనులు పూర్తయిందని ఈఈ కంప్లీషన్ సర్టిఫికెట్‌ను జారీ చేయగా ఒప్పందం ప్రకారం 2020 జూన్ 29 నాటికి ఆనకట్ట నిర్మాణం, పనులు పూర్తయి బ్యారేజిని ప్రారంభించినట్లు ఎస్‌ఈ నిర్ధారించి, కౌంటర్ సంతకం చేశారు.
- ఆగస్టు 26 2016లో జరిగిన మొదటి ఒప్పందం, జులై 2న 2018లో జరిగిన మొదటి అనుబంధ ఒప్పందం ప్రకారం చేయాల్సిన అన్ని పనులను పరిశీలించి పూర్తయినట్లు నీటిపారుదలశాఖ డాక్యుమెంట్ చేసింది.
- జూన్ 29 2020 నాటికి పని పూర్తయినట్లు, ఒప్పందం ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైనట్లు కాంట్రాక్టు సంస్థ అండర్ టేకింగ్ ఇచ్చిన తర్వాత మార్చి 15న 2021లో కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు.
- మే 9 2022లో జరిగిన రెండో అనుబంధ ఒప్పందం ప్రకారం కొన్ని కొత్త పనులకు సంబంధించి 2022 మే 2న, 2023 మే 17న కాంట్రాక్టు సంస్థ నీటిపారుదలశాఖకు లేఖలు రాసినా స్పందించలేదు.
- సెప్టెంబరు 18న 2024 నీటిపారుదలశాఖ రాసిన లేఖలో 2020 జూన్ 29వ తేదీ నాటికి ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయో స్పష్టంగా చెప్పలేదు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం 2020 జూన్ 29కి ముందు కానీ, 2021 మార్చి 15 వరకు కానీ పెండింగ్ పనులున్నట్లు నీటిపారుదలశాఖ నోటిఫై చేయలేదు.
- పై విషయాలన్నింటి ఆధారంగా ఒప్పందం ప్రకారం పని పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీన్ని అక్రమమని ప్రకటించడం తగదు. దీన్ని మేం అంగీకరించడంలేదు అంటూ ఎల్‌అండ్‌టీ తరఫున సురేశ్‌కుమార్ నీటిపారుదలశాఖ ఎస్‌ఈకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ రద్దు - మిగిలిన పనులను అదే సంస్థతో చేయించాలని ప్రభుత్వ ఆదేశాలు - Telangana Govt On Medigadda Works
‘మేడిగడ్డ’ కుంగుబాటులో వారి పాత్ర! - విచారణ కమిషన్‌కు విజిలెన్స్ మధ్యంతర నివేదిక - Vigilance Report On Medigadda