Kurian Committee Opinion Poll Concluded : తెలంగాణాలో పార్లమెంటు ఫలితాలపై ఆరా తీసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కురియన్ కమిటీ రెండు రోజుల పర్యటన ముగిసింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్ధులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయిన కురియన్ కమిటీ సభ్యులు అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు.
ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కురియన్ కమిటీ భేటీకి పలువురు నాయకులు హాజరై వారి అభిప్రాయాలను తెలియచేశారు. మొదటి రోజు 16 లోకసభ అభ్యర్ధుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్న కురియన్ కమిటీ ఇవాళ అనేక మంది నాయకులతో భేటీ అయ్యి వారి అభిప్రాయాలను తీసుకుంది. కురియన్ కమిటీని ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌లు, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు కలిశారు.
కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం బాకీ : కోదాడ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చినట్లు కమిటికి చెప్పినట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ను ఓడించాలనే మొదటి లక్ష్యం నెరవేరిందని, కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం నెరవేరాల్సి ఉందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
"రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉండదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీయే ఇంకా పదేళ్లు అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ ఖాళీ అవటం ఖాయం, హరీశ్‌రావు సైతం బీజేపీలో చేరుతారు. ఇంకా జగదీశ్ రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవినీతి చేశారు. ఇంక ఆయన జైలుకు వెళ్లటం పక్కా. అవినీతి ఆరోపణలు ఉన్న బీఆర్ఎస్ నేతలను ఎవరినీ మా పార్టీలోకి తీసుకోము."-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే