KTR On Formula E racing case : రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహించామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీపీ) తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ కార్ రేస్ జరపాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్న కేటీఆర్ 2001లోనే చంద్రబాబు ఫార్ములా-1 రేస్ నిర్వహించేందుకు యత్నించారని తెలిపారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఫార్ములా- ఈ కార్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరామని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల మధ్య చర్చ పెడదాం అని స్పీకర్‌ను కోరానన్న ఆయన ఫార్ములా- ఈ కార్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
అసెంబ్లీలో ఈ కార్ అంశంపై చర్చ పెట్టాలి :ఫార్ములా- ఈ కార్ అంశంలో అక్రమాలు చేశామని ప్రభుత్వం అంటుందన్న కేటీఆర్ వాటిని నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రోజుకో అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టి సమగ్రంగా చర్చించాలని సవాల్ విసిరారు.
ఫార్ములా-1 రేస్ ట్రాక్ కోసం గోపన్‌పల్లిలో భూసేకరణ జరిగిందని కేటీఆర్ తెలిపారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉందని వివరించారు. ఎఫ్-1 చుట్టూ నగరాల అభివృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎఫ్-1 రేస్‌ల నిర్వహణకు దేశవ్యాప్త పోటీ ఉందని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు 2001లో జినోమ్‌వ్యాలీని ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. నాడు ఏర్పాటు చేసిన జినోమ్ వ్యాలీ ఇప్పుడు ఉపయోగపడుతుందన్నారు.