KTR Fires on Revanth Reddy : రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ అంటుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారన్నారు.
ఆధారాలు లేకుండా ఫేక్ న్యూస్ రాస్తే ఊరుకునేది లేదు : కేటీఆర్ - KTR Fires on CM Revanth
మోదీ చోటాభాయ్ రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) గుజరాత్ మోడల్‌ను పొగుడుతున్నారని, బీజేపీ పాట పాడుతున్నారన్నారని మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, 40 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డేనని పేర్కొన్నారు. జీవితాంతం కాంగ్రెస్‌లో ఉంటా అని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయచేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని, విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, భయపడే వాళ్లు లేరని కేటీఆర్ అన్నారు. సామంత రాజులా దిల్లీకి 2500 కోట్లు కప్పం కట్టారని, ఇందుకోసం అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలో గత మూడు నెలలుగా భవన నిర్మాణ అనుమతులు ఎందుకు అపారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కిషన్ రెడ్డి(Kishan reddy) హైదరాబాద్‌కు చేసిందేమీ లేదన్న కేటీఆర్, కేసీఆర్ కట్టిన 36 ఫ్లై ఓవర్లు, కేంద్రం చేపట్టిన అంబర్‌పేట ఫ్లై ఓవర్లు గురించి మాట్లాడాలని కోరారు.
KTR Reacts on Kavitha Arrest :బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తే హైదరాబాద్‌లో ఎవరూ నమ్మలేదని, దురదృష్టకరంగా కాంగ్రెస్ చిల్లర ప్రచారాన్ని కొందరు నమ్మారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవితను అరెస్ట్ చేయలేదని బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గతంలో కాంగ్రెస్ నేతలు అన్నారన్న కేటీఆర్, ఇవాళ పగపట్టి అరెస్ట్ చేశారని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేశారని, ఇపుడు కాంగ్రెస్ ఏమంటుందని ప్రశ్నించారు.