How To Delink Bogus Company From PF Account : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు డబ్బుల కోసం బెదిరిస్తూ ఫోన్ చేశారు. ఆ ఉద్యోగి డబ్బులు ఇవ్వనని చెప్పడంతో ఆయన పీఎఫ్ ఖాతా(యూఏఎన్)ను వారు బోగస్ కంపెనీకి అనుసంధానం చేశారు. ఆ విషయం తెలియని ఉద్యోగి మరో కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లగా ఒకే సమయంలో 2 కంపెనీల్లో పని చేసినట్లు సర్వీసు హిస్టరీలో కనిపించింది. దీంతో ఆయన ఉద్యోగ అవకాశం కోల్పోయారు. ఇటువంటి ఖాతాలను తొలగించాలంటే ఈపీఎఫ్‌వోకు పరిపాలన, సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యేవి. ప్రస్తుతం దీనికి పరిష్కారం లభించింది. ఉద్యోగస్థులే సొంతంగా బోగస్ కంపెనీ వివరాలు తొలగించుకునేందుకు వీలు కల్పిస్తూ డీలింక్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది.
ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో 2 కంపెనీల్లో పని చేయకూడదు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు ఉద్యోగులను నగదు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను ఒడిశా, రాజస్థాన్, యూపీ, గుజరాత్ వివిధ రాష్ట్రాల్లో నమోదైన బోగస్ కంపెనీల్లో పని చేస్తున్నట్లు లింకు చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ఇటీవల ఈపీఎఫ్‌కు, పోలీసులకు ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. పీఎఫ్ ఖాతాకు అనుసంధానం అయిన బోగస్ కంపెనీల వివరాలు తొలగించాలంటే ప్రాంతీయ ఆఫీస్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. ఈపీఎఫ్‌వో ఇప్పుడు ఈ పద్ధతిని మార్చింది. చందాదారులకు తెలియకుండా పీఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బోగస్ కంపెనీల వివరాలను వారే వ్యక్తిగతంగా తొలగించుకునే ఆప్షన్‌ను అమలులోకి తెచ్చింది.
డీలింక్ ఇలా చేయండి : -
- చందాదారులు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లో యూఏఎన్ నంబరు, పాస్‌వర్డ్‌తో నమోదు చేసి లాగిన్ కావాలి.
- తర్వాత హోంపేజీలోని 'వ్యూ' ఆప్షన్‌లో ఉండే 'సర్వీస్ హిస్టరీ' మెనూ ఎంచుకోవాలి.
- ఈ సర్వీసు హిస్టరీలో తెలియకుండా పీఎఫ్ అకౌంట్ లింకు అయిన కంపెనీ వివరాలతో పాటు ఆ పక్కనే ‘డీలింక్’ ఆప్షన్ ఉంటుంది.
- డీలింక్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఆధార్ కార్డు అనుసంధాన ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని నమోదు చేస్తే డీలింక్ ప్రక్రియ పూర్తి అవుతుంది. తరువాత సర్వీసు హిస్టరీలో చూస్తే డీలింక్ అయిన సంస్థ వివరాలు కనిపించవు.
- ఒకవేళ ఉద్యోగి వాస్తవంగానే 2 కంపెనీల్లో పనిచేస్తే (మూన్‌లైటింగ్) 2 సంస్థలూ ఈపీఎఫ్ చందా చెల్లించినట్లు రికార్డుల్లో నమోదైతే డీలింక్ చేయాలనుకున్నా వీలుకాదు. ‘ఎర్రర్’ అని చూపిస్తుంది. ఆ అకౌంట్ వివరాలు డీలింక్ కావు.
- ఆధార్ కార్డ్ అనుసంధాన మొబైల్ నంబరు మనుగడలో ఉండాలని, డీలింక్ చేయబోయే కంపెనీ విషయంలో పొరపాట్లు జరగకుండా సరిచూసుకోవాలని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.
పీఎఫ్ అకౌంట్లో మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
ఇకపై నేరుగా ATM నుంచి PF డబ్బులు విత్‌డ్రా- వారందరికీ స్పెషల్ కార్డ్- రూ.7లక్షలు ఇన్సూరెన్స్!