KTR Comments on Palamuru Project : రేవంత్ సర్కార్ కేసీఆర్‌కి పేరు వస్తుందనే ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నిటిని, మేడిగడ్డ పర్యటన తరహాలో తమ నాయకులతో కలిసి సందర్శిస్తామని తెలిపారు. ఇటీవల మాజీమంత్రి లక్ష్మారెడ్డి భార్య శ్వేతా లక్ష్మారెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.
నిర్దాక్షిణ్యంగా కూల్చివేత : అనంతరం నేరేళ్లపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లో ఆక్రమణల పేరుతో పేద ప్రజలు, వికలాంగులని కూడా చూడకుండా సుమారు 75 ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని మండిపడ్డారు. పాలమూరు బిడ్డగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కూల్చేసిన 75 మంది నిరాశ్రయులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
మేఘాకే టెండర్లు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగి సుమారు రూ. 80 కోట్ల ప్రజాధనం నష్టం జరిగిందని, అలాంటి ప్రాజెక్ట్ కట్టిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ వారికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎలా అప్పజెప్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు పనులు ఎలా ఇస్తారని, ఇందులో ఉన్న మర్మమేమిటో చెప్పాలని తెలిపారు.