KTR Comments On CM Revanth Reddy: ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడి కోసమో, అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అని ప్రశ్నిచారు. గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కుమారుడికి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకు దూరం చేస్తున్నారని అన్నారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించండం ఎవరి కోసం చేస్తున్న కుట్ర అని నిలదీశారు.
మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టడం ఎవరి కుట్ర అని అన్నారు. 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతుకష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుందని విమర్శించారు. ఈ క్రమంలోనే ఏదో ఒక కేసులో తనను ఇరికించి అరెస్ట్ చేస్తారని తనకు ఎప్పుడో తెలుసని, రైతుల గొంతుక అయినందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతానన్నారు. కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని, అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు.
ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతుకైనందుకు, అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను. కుట్రలకు భయపడే వాళ్లు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి. - ట్విటర్లో కేటీఆర్
కేటీఆర్ పేరు చెప్పిన నరేందర్ రెడ్డి!: లగచర్ల ఘటన రాజకీయ మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. దాడికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని సూత్రధారిగా పేర్కొన్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా కేటీఆర్ పాత్ర గురించి నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటూ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహ రచన చేశారని, తన అనుచరుడు బోమమోని సురేశ్‌ను వినియోగించుకుని మిగిలిన నిందితులను రెచ్చగొట్టినట్లు రిపోర్టులో తెలిపారు. హకీంపేట్, పోలేపల్లి, రోటిబండ తండ, పులిచర్ల తండ, లగచర్ల గ్రామాల రైతులను సురేశ్ సహాయంతో ఉసిగొల్పారని, ఈ విషయంలో పార్టీ అగ్రనేతలు అండగా ఉంటారని గ్రామస్థులకు నూరిపోశారని నివేదికలో పేర్కొన్నారు.