Kidney Transplant Performed Without Permission :రాష్ట్ర రాజధానిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సరూర్‌నగర్‌లోని అలకనంద ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడులు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి రంగంలోకి దిగడంతో గుట్టు రట్టయింది. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఆసుపత్రి సీజ్ :హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడులు చేస్తున్న ఆసుపత్రిపై పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రి లోపల నలుగురిని గుర్తించిన పోలీసులు వారికి కిడ్నీ శస్త్ర చికిత్స జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు దాతలుగా భావిస్తున్నారు. మరో ఇద్దరు గ్రహీతలుగా భావిస్తున్నారు. వీరు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. వీరు ఈ నెల 17 న ఆసుపత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. వారిని ప్రశ్నించగా తాము కిడ్నీలో రాళ్లు తీసుకోవడానికి వచ్చినట్టు తెలిపారు. కానీ అధికారుల పరిశీలనలో మాత్రం వారికి కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నలుగురికి కిడ్నీ మార్పిడి జరిగిందా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్దారించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో అలకనంద ఆసుపత్రిని సీజ్ చేశారు.