తెలంగాణ

telangana

ETV Bharat / state

లిఫ్ట్ ఇవ్వమని జాలిగా అడుగుతారు - నమ్మి ఇచ్చారో మీ పని ఖతం! - KHILADI LADYS AT HYDERABAD

ద్విచక్ర వాహనదారులే లక్ష్యంగా వలపు వల - బస్టాండ్ల వద్ద మాయలేడీల హల్‌చల్‌

KHILADI LADYS AT HYDERABAD
Sextortion Cases Rising in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 7:20 AM IST

Updated : Jan 6, 2025, 9:33 AM IST

Sextortion Cases Rising in Hyderabad :బస్టాండ్, రోడ్లపైన చేతిలో సంచితో బస్సు కోసం నిరీక్షిస్తారు. లిఫ్ట్ ఇవ్వమని వాహనాదారులను అడుగుతారు. మహిళకు సాయం చేయాలనే సానుభూతితో బండి ఎక్కించుకుంటే కొంత దూరం వెళ్లాక పథకాన్ని అమలు చేస్తారు. కొన్నిసార్లు వలపు వల విసిరి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వెళ్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తనను వేధించారని గొడవ చేస్తామంటారు. పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తారు. పరువుపోతుందని బాధతో వాళ్లు అడిగినంతా ఇచ్చేస్తున్నారు. ఇలా చాలా మంది పురుషులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

Sextortion Cases Rising in Hyderabad (ETV Bharat)

ద్విచక్ర వాహనదారులే లక్ష్యం : తాజాగా లాలాగూడ పోలీసులు భాగ్య, లలిత అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారు వాహనదారులను లిఫ్ట్ అడిగి, ఆ తర్వాత బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారించారు. సికింద్రాబాద్ పరిధిలో ఒకరి వద్ద రూ.3.30 లక్షలు, మరొకరి నుంచి రూ.2 లక్షలు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. చిలకలగూడ, వారాసిగూడ ప్రాంతాల్లో మరో 10 మందిని ఇదే తరహాలో మోసగించినట్లు భావిస్తున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో మరో 10 మంది కిలేడీలు ద్విచక్ర వాహనదారులే లక్ష్యంగా రెచ్చిపోతున్నట్లు పోలీసులు వివరించారు.

మధ్యవయసు పురుషులపై గురి : లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలు కొత్త తరహా మోసాలకు పాల్పడ్డారు. వారు జట్టుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు. అక్కడ బస్ స్టేషన్ వద్ద ఉంటారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వారినే లక్ష్యంగా చేసుకొని అత్యవసర పనిపై వెళ్లాలంటూ లిఫ్ట్ ఇవ్వమని ప్రాధేయపడతారు. వాహనం దిగగానే తన శరీరాన్ని తాకావంటూ వాగ్వాదానికి దిగుతారు. కేకలు వేస్తామంటూ బెదిరించి అందినకాడికి డబ్బులు దోచుకుంటారు.

డబ్బు ఇవ్వకపోతే ఒంటిపై ఉన్న బంగారం గుంజుకుంటారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే అత్యాచారానికి పాల్పడ్డావని పోలీస్ స్టేషన్​కు వెళతామంటూ బెదిరిస్తారు. ఫోన్ నంబర్లు, వివరాలు తీసుకొని ఇంటికెళ్లి గొడవచేస్తారు. కుటుంబీకుల ఎదుట జరిగిన గొడవతో పరువు పోతుందని ఓ వ్యక్తి రూ.5 లక్షలు ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం.

మాయలేడీల హల్‌చల్‌ : బంజారాహిల్స్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గ్, కేబీఆర్‌ పార్క్‌ వద్ద కొందరు మహిళలు రాత్రిళ్లు కారు, ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్‌ అడుగుతారు. ఆ తర్వాత వారిని కవ్విస్తూ హోటళ్లకు తీసుకెళ్లి మాయమాటలతో ముంచెత్తుతారు. నగ్నంగా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి వాటిని అంతర్జాలంలో ఉంచుతామంటూ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు వసూల్ చేస్తున్నారు. డిసెంబరు 31న రాత్రి అబిడ్స్‌కు చెందిన ఓ వ్యాపారిని ఇదే తరహాలో మహిళ బెదిరిస్తే రూ.1.50 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చి బయటపడ్డాడు.

హోటల్‌కు రమ్మని: హైదరాబాద్​కు చెందిన పాత నేరస్థులు మోసాలకు పాల్పడ్డారు. పేద కుటుంబాలకు చెందిన మహిళలు, యువతులకు కమీషన్‌ ఇస్తామని ఆశ చూపి ముఠాలో చేర్చుకుంటారు. వారు దుకాణాలు, హోటళ్ల వద్దకెళ్లి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని, సరకులు సరఫరా చేయాలంటూ ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. అర్ధరాత్రి దాటాక మహిళలతో ఆ వ్యాపారులకు ఫోన్‌ చేయిస్తారు.

ఒంటరిగా గడిపేందుకు హోటల్‌కు రమ్మని ఆహ్వానిస్తారు. వలపు వలకు చిక్కి హోటల్‌ గదికి వెళ్లిన వారిని ముఠా సభ్యులు చుట్టుముట్టి బెదిరిస్తారు. సోషల్ మీడియాలో పరిచయమైన పురుషుడికి తనతో గడిపేందుకు మణికొండ రావాలని ఓ మహిళ లొకేషన్‌ పంపింది. అక్కడకు వెళ్లి ఫోన్‌ చేసిన వారికి బంధువులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ రూ.లక్షలు గుంజి ముఖం చాటేసింది.

వలపు వల విసురుతారు - చిక్కితే జేబు గుళ్ల చేస్తారు - ఇదొక కొత్త తరహా మోసం

వలపు వలతో తెలుగు యువత విలవిల - ఆ జిల్లాలోనే ఎక్కువ మంది బాధితులు

Last Updated : Jan 6, 2025, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details