Lok Sabha Elections 2024 : పదేళ్ల బీజపీ పాలనలో మోదీ 150 హామీలు, నినాదాలు ఇచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన మండిపడ్డారు. మోదీ అచ్చే దిన్ అంటే, చచ్చే దిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ కరీంనగర్‌లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ఐదు నెలల పాలనలోనే రాష్ట్రం ఆగమాగం అయింది : కేసీఆర్ - KCR Bus Yatra in Medak
ఈ పదేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని కేసీఆర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగాయని ఆయన తెలిపారు . బేటీ బచావో, బేటీ పడావో కోసం మోదీ ఏమైనా చేశారా? అని నిలదీశారు. మోదీ నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేశారా? అని ప్రశ్నించారు. రూపాయి విలువ దారుణంగా రూ.84కు పడిపోయిందని, పాకిస్థాన్ పేరు చెప్పి సెంటిమెంట్ బ్లాక్‌మెయిల్ చేసి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ నేతలు ఓట్లు అవసరమైనప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని, కేసీఆర్ ఆరోపించారు. నల్లచట్టాలు తెచ్చి ఉత్తరాదిలో 700 మంది రైతుల ప్రాణాలు బలిగొన్నారని దుయ్యబట్టారు. యూపీలో ఎన్నికలు రాగానే రైతులకు క్షమాపణ చెప్పి నల్లచట్టాలు రద్దు చేశారని తెలిపారు. 60 ఏళ్లు పాలించిన ప్రధానులు రూ.55 లక్షల కోట్లు అప్పులు చేశారని, మోదీ మాత్రం పదేళ్లలోనే రూ.105 లక్షలు కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందిందని, బండి సంజయ్ కరీంనగర్‌కు ఏమైనా నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు.