Yuva On Karimnagar Students Develop Solar Drainage System : కరీంనగర్ జిల్లా సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నారు ఈ ఐదుగురు విద్యార్థులు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు తొలగించే క్రమంలో మనదేశంలో ఎంతమంది పారిశుద్ధ్య కార్మికుల మృతి చెందారో తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు. వారి సౌలభ్యం కోసం తమవంతు ప్రయత్నంగా మానవ రహిత యంత్రాన్ని రూపకల్పన చేయాలని భావించారు.
తమ ఆలోచనలను కళాశాల మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎం.వి.సతీష్‌కుమార్‌తో పంచుకొన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో అవసరమైన పరికరాలు సమకూర్చుకున్నారు. తక్కువ ఖర్చుతోనే విజయవంతంగా యంత్రం రూపొందించి దీనికి 'లో కాస్ట్ సోలార్ పవర్ డ్రైన్ క్లీనింగ్ మెషిన్' అని నామకరణం చేశారు. సోలార్ విద్యుత్‌తో నడిచే ఈ యంత్రాన్ని 2 వారాల్లోనే పూర్తిచేశామని విద్యార్థులు తెలిపారు. నాలాల నుంచి చెత్తను సులువుగా ఎత్తేసేలా సోలార్ డ్రైన్ క్లీనర్‌ను తీర్చిదిద్దారు. దీనికి అమర్చిన చైన్లు తిరగుతూ ఉంటే ప్లేటు ఒకేసారి పైకి వచ్చిన చెత్త వెనుక భాగంలో ఒక ట్రేలో పడుతుంది. దాని నుంచి సరాసరి మెషిన్ కింద ఉంటే డబ్బాలో పడేలాగ రూపకల్పన చేశారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ యంత్రానికి ఉన్న ఇతర ప్రత్యేకతలేంటో వివరిస్తున్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఆర్థిక సహాయం : ప్రస్తుతం నమూనా దశలోనే ఉన్న సోలార్ డ్రైనేజీ క్లీనర్‌ను అవసరమైతే సామర్థ్యాన్ని పెంచుకోని కూడా వాడవచ్చని అంటున్నారు. ఈ ఆవిష్కరణ కోసం ఉపయోగించిన పరికరాలు, సాధనాలు తయారీ విధానం గురించి చెబుతున్నాడు విద్యార్థి కృష్ణమాధవ్. ఈ ప్రాజెక్టు తయారీకి 38వేల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు. దీని తయారీకి గాను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా నుంచి రూ.20వేల ఆర్థిక సహాయం లభించిందని అంటున్నారు. ఈ యంత్రాన్ని ఒక చోట నుంచి మరో చోటుకి అవలీలగా తరలించేలా రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నారు.