Kadiyam Srihari Speech in Assembly Sessions 2024 :రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఆరోరోజు కొనసాగుతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అనుబంధ అంచనాలపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) చర్చను ప్రారంభించారు. దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని అన్నారు. చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెస్సే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్ కూడా కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేశారు.
Kadiyam Srihari Vs Ministers in Assembly : 'బడ్జెట్ ప్రవేశ పెడుతూ రాష్ట్రం ఇచ్చిన యూపీఏ, సోనియాకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ 'మలిదశ ఉద్యమ నాయకులు, కేసీఆర్‌ను మాత్రం మరచిపోవడం బాధాకరం. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం చేశారు. 2001లో తెలంగాణ మలి దశ ఉద్యమం చేశారు. తొలి దశ, మలి దశ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్సే. తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని' కడియం శ్రీహరి తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని కడియం శ్రీహరి గుర్తు చేశారు. నియంతృత్వ, నిర్బంధ పోకడలు ఉన్నాయంటున్న వారే ఎమర్జెన్సీ విధించిన విషయం మరచిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ఎమర్జెన్సీ చీకటి రోజులు మరచిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఆమె మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 404 స్థానాలు గెలుచుకుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యమని చెప్పినా 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చేట్లు లేదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.
రైతులకు ఎన్నికల్లో చెప్పింది చాంతాడంత - బడ్జెట్‌లో ఇచ్చింది చెంచాడంత : హరీశ్ రావు
Telangana Budget Sessions 2024 : కడియం శ్రీహరి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) స్పందించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు కావాల్సిన హక్కులను కల్పించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు గౌరవంగా బతుకుతున్నారంటే అంది కాంగ్రెస్ వల్లేనని గుర్తు చేశారు. విపక్ష సభ్యులు ఇందిరమ్మ రాజ్యం అంశంపై ప్రత్యేకంగా చర్చిద్దామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. అనంతరం స్పందించిన కడియం శ్రీహరి బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపైనే మాట్లాడుతున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఒకే కుటుంబం కోసం పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.