Justice PC Ghosh Commission Investigation : మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పనులు, నాణ్యత, నిర్మాణ సమయంలో నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణకు సంబంధించి ఇంజినీర్లను జస్టిస్ పీసీఘోష్ ప్రశ్నించారు. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన పది మంది ఇంజినీర్లు హాజరయ్యారు. గతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల వద్ద క్యూసీ విధులు నిర్వర్తించిన ఇంజినీర్లు అందులో ఉన్నారు.
మేడిగడ్డ ఆనకట్ట అంచనాలపై : కమిషన్ ముందు గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించారు. మేడిగడ్డ ఆనకట్ట అంచనా వ్యయం పెరుగుదల, బ్యాంకు గ్యారంటీలు, కుంగుబాటు గురించి ఎస్ఈ, ఈఈలను కమిషన్ ప్రశ్నించింది. శాఖాపరమైన వైఫల్యాల వల్లే ఆనకట్ట కుంగినట్లు ఇంజినీర్లు చెప్పారు. మేడిగడ్డ ఆనకట్ట 3,4,5 బ్లాకుల్లో సమస్యలు ఉన్నాయని ఐఐటీ బృందం చెప్పిందని నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకున్నప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు.
అంచనా వ్యయం పెంపు, బ్యాంకు గ్యారంటీలకు సంబంధించిన ప్రశ్నలకు ఇంజినీర్లు సమాధానాలు దాట వేశారు. అన్నారం ఆనకట్ట డిజైన్ సరిగా లేదని సంబంధిత ఈఈ తెలిపారు. వరదకు తగ్గట్లుగా డిజైన్ లేదని సెకనుకు ఐదు మీటర్ల వరదను తట్టుకునేలా రూపొందిస్తే 18 మీటర్ల వరకు వరద వస్తోందని ఇంజినీర్లు తెలిపారు. అన్నారం బ్యారేజీ అలైన్మెంట్ సరిగా లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయన్న ఇంజినీర్లు మొన్నటి వరదలకు కూడా ఏడు మీటర్ల లోతు ఇసుక పేరుకుపోయిందని అన్నారు.