Justic PC Ghose Commission on Kaleshwaram Project : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన విచారణ తదుపరి దశ బుధవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానుంది. విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదుల శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, పదవీ విరమణ చేసిన వారు, ఇతరులను విచారణ చేసింది. వారి నుంచి అవసరమైన విషయాలను ఆరా తీసిన కమిషన్ అందరి నుంచి అఫిడవిట్లు స్వీకరించింది. కమిషన్ ముందు ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. తదుపరి దశలో వారందరినీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
ఆ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కమిషన్ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్‌లోనే ఈ బహిరంగ విచారణ ప్రక్రియ జరగనుంది. కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవసరమైన వారు న్యాయవాదులను కూడా వెంట తెచ్చుకునే వెసులుబాటు ఉంది.