తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటన - కేసీఆర్​, హరీశ్​రావు పిటిషన్​పై తీర్పు రిజర్వ్​ - HIGH COURT ON MEDIGADDA PROJECT

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ - తీర్పును రిజర్వ్ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

HC Reserved Judgement on KCR Harish Rao Petition
HC Reserved Judgement on KCR Harish Rao Petition (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 4:29 PM IST

HC Reserved Judgement on KCR Harish Rao Petition :మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనలో భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్​ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడానికి నాసిరకమైన నిర్మాణంతో పాటు సరైన డిజైన్ లేకపోవడమే కారణమంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి భూపాలపల్లి లోయర్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని లోయర్‌ కోర్టు కొట్టివేయడంతో జిల్లా న్యాయస్థానంలో రాజలింగమూర్తి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

రాజలింగమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్​రావుతో కలిపి ఆరుగురికి నోటీసులను జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్‌, హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు పరిధి లేకున్నా పిటిషన్‌ను విచారణకు స్వీకరించిందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు ఇది విరుద్ధమని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గత విచారణ సందర్భంగా జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.

ఇటీవలే హత్యకు గురైన రాజలింగమూర్తి : ఫిర్యాదుదారు రాజలింగమూర్తి గత వారం హత్యకు గురయ్యాడు. విచారణ సందర్భంగా ఈ విషయం హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసిన వ్యక్తి మృతి చెందిన తర్వాత ఇక ఆ పిటిషన్‌ను ఎలా విచారిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు మృతి చెందినా పిటిషన్‌ను విచారించొచ్చని వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును చదివి వినిపించారు. మేడిగడ్డ బ్యారేజీ వల్ల లక్షా 30వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్న విషయాన్ని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పీపీ వాదించారు.

తీర్పును రిజర్వ్​ చేసిన హైకోర్టు : ఇందులో ప్రజాప్రయోజనం ఉన్న దృష్ట్యా పిటిషన్‌ను విచారించొచ్చని పీపీ వాదించారు. గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జిల్లా కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్​ రావు తరఫు న్యాయవాది కోరారు. ఈ మేరకు హైకోర్టు తీర్పును చదివి వినిపించారు. రాజలింగమూర్తి ఫిర్యాదును భూపాలపల్లి లోయర్ కోర్టు కొట్టివేయగా ఫిర్యాదుదారు జిల్లా కోర్టును ఆశ్రయించారని ఈ పిటిషన్‌పై తీర్పును పున పరిశీలించాలని జిల్లా కోర్టు కింది కోర్టును ఆదేశించి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఫిర్యాదుదారు చనిపోతే మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై విచారణ ఎలా చేస్తాం? : హైకోర్టు

'2019లోనే సమస్యలొచ్చాయి - నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ఆనకట్టకు ప్రమాదం!'

ABOUT THE AUTHOR

...view details