JEE Main 2025 Schedule Out :దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీటెక్/ బీఆర్కే సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్-2025 ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఎన్టీఏ(NTA) అక్టోబరు 28న ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభం అవ్వనున్నాయి. అలాగే రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. కానీ గతేడాదితో పోల్చితే ఈసారి మాత్రం 40 రోజులు ఆలస్యంగా ప్రకటనను విడుదల చేశారు. ఈసారి అందరినీ ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే పరీక్షల ఫలితాల తేదీలను కూడా ప్రకటించారు. ఈసారి కూడా సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని నోటిఫికేషన్‌ను చూస్తే అర్థం అవుతుంది. పరీక్షల విషయానికి వస్తే గతేడాది జనవరి 24న పరీక్షలు జరగ్గా ఈసారి రెండు రోజులు ముందుకు జరిపి నిర్వహించడం విశేషం.
పరీక్షల షెడ్యూల్ :
తొలి విడత
- ఆన్లైన్ దరఖాస్తులు : అక్టోబరు 28 నుంచి నవంబరు 22 వరకు
- హాల్ టికెట్లు డౌన్లోడ్ : పరీక్షకు మూడు రోజుల ముందుగానే.
- పరీక్షలు నిర్వహణ : జనవరి 22 నుంచి జనవరి 31 మధ్య(2025)
- ఫలితాలు : ఫిబ్రవరి 12.
రెండో విడత
- ఆన్లైన్ దరఖాస్తులు : జనవరి 31 నుంచి ఫిబ్రవరి 24 వరకు
- హాల్ టికెట్లు : పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు
- పరీక్షలు : ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 మధ్య(2025)
- ఫలితాలు : ఏప్రిల్ 17 నాటికి.
అర్హత :అభ్యర్థులకు వయోపరిమితి లేదు.
(2023,2024లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2025లో వయసుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ-2025(మెయిన్) పరీక్షకు హాజరుకావచ్చు.)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ : హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, వరంగల్.
ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్టణం, సూరంపాలెం, నరసరావుపేట, ఒంగోలు, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, తిరుపతి.
- దరఖాస్తు నింపడంలో ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్‌చేయవచ్చు.
పరీక్ష నిర్వహణ ఇలా :
- గత రెండేళ్ల మాదిరిగానే ప్రశ్నాపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. ఇందులో ఈసారి సెక్షన్-బిలో 5 ప్రశ్నలు మాత్రమే.
- గత మూడేళ్ల మాదిరిగా ఈసారి ఛాయిస్ మాత్రం ఉండదు.
- రెండు సెక్షన్లలో మైనస్ మార్కులు ఉంటాయి.
- సరైన సమాధానం రాస్తే 4 మార్కులు వస్తాయి. తప్పు సమాధానం అయితే మైనస్ 1 మార్కు ఇస్తారు.
- ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగనుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
- పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహణ.(ప్రశ్నపత్రం ఆంగ్లంతో పాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలో కూడా ఉంటుంది)
- పేపర్-1కు 300 మార్కులు, పేపర్-2కు 400 మార్కులు.
- దరఖాస్తులో మొబైల్ నంబరు, ఈ-మెయిల్ చిరునామా విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులకు సంబంధించినది ఇవ్వాలి. ఎందుకంటే ఏదైనా సమాచారం ఉంటే వారికి ఎన్టీఏ పంపుతుంది.
- ఎన్టీఏ స్కోరు కోసం ముందుగా మ్యాథ్స్, ఆ తర్వాత భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో విద్యార్థులకు సమాన మార్కులు వస్తే మాత్రం తక్కువ మైనస్ మార్కుల ప్రకారం సీటు ఇస్తారు.
జేఈఈ మెయిన్ ఎందుకు నిర్వహిస్తారు? :
- దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్ఐటీల్లో 24 వేలకుపైగా, ట్రిపుల్ఐటీల్లో 8,500లకు పైగా బీటెక్ సీట్లు ఉన్నాయి. వీటిని జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు.
- ఐఐటీల్లో బీటెక్‌లో చేరాలంటే మెయిన్‌లో ఉత్తీర్ణులైన వారు జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి.
- జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత.
- ఎన్ఐటీల్లో 50 శాతం సీట్లు సొంత రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
- ఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు యాజమాన్య కోటా సీట్లను కేటాయిస్తాయి.
- బీఆర్క్, బీ ప్లానింగ్‌లో ప్రవేశించేందుకు పేపర్-2, బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష జరుగుతాయి. ఇందులో బీఆర్‌కేకు 50 వేల లోపే దరఖాస్తులు వస్తాయి. ఈ పరీక్షను తొలి రోజునే నిర్వహిస్తారు. ఆ తర్వాత నుంచే పేపర్-1 నిర్వహిస్తారు.
ఛాయిస్ ఎత్తివేత :కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ప్రతి సబ్జెడ్లో ఛాయిస్ రూపంలో ఇచ్చిన వెసులుబాటును ఎన్టీఏ ఎత్తివేసింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్ బీలో ఈ ఛాయిస్ కొనసాగింది. ఇప్పుడు ఈ ఛాయిస్‌ను ఎత్తివేశారు.
జేఈఈ షెడ్యూల్ వచ్చేసింది - పరీక్షలు సహా ఫలితాల తేదీలు ఎప్పుడెప్పుడంటే?
జేఈఈ, నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? - మీ కోసమే ఫ్రీ కోచింగ్ - ఎక్కడంటే?