Pawan Kalyan Speech in Praja Galam Meeting :ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ (Prime Minister Modi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రధాని నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చిందని అన్నారు.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే - ఎన్డీఏ ప్రభుత్వం రావాలి : ప్రధాని మోదీ
ఎన్డీయే పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం తెలుపుతున్నామని పేర్కొన్నారు. 2014లో తిరుపతి వెంకటేశ్వర స్వామి (Tirupati Venkateswara Swamy) సాక్షిగా ప్రారంభమైన పొత్తు, ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని పవన్ అన్నారు.
ధర్మానిదే విజయం-పొత్తుదే గెలుపు- కూటమిదే పీఠం :సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సారా వ్యాపారిగా మారారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా డిజిటల్ ట్రాన్సక్షన్ చేస్తుంటే, ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, పారిశ్రామిక ప్రగతి (Industrial Progress) 2019లో 10.24 శాతం ఉండగా, ప్రస్తుతం 3 శాతానికి దిగజారిపోయిందని ఆరోపించారు.