IT Raids on Producer Dil Raju House : సినీ పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థలపై ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని దిల్ రాజు నివాసంలో తనిఖీలు ముగించిన ఐటీ అధికారులు, తమ వాహనంలోనే దిల్ రాజును సాగర్ సొసైటీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఆదాయ పన్ను చెల్లింపులో వ్యత్యాసాలు! : సినిమాల ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న వివరాలపై అక్కడే ఉన్న దిల్ రాజుతోపాటు అతని సోదరుడు శిరీష్, ఇతర ముఖ్య సిబ్బందిని ఆరా తీస్తున్నారు. నాలుగేళ్ల నుంచి ఆదాయ పన్ను చెల్లింపులో వ్యత్యాసాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు అడిగే అన్ని వివరాలకు దిల్ రాజు సమాధానం ఇస్తూ ఎలాంటి ఆందోళన లేకుండా కనిపిస్తున్నారు.