IT Companies Reduced Hiring 2024 : అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తర్వాత అరచేతిలోకి అన్ని సౌకర్యాలు వచ్చాయి. ఏ పని కావాలన్నా ఇంటర్నెట్ మీదే ఆధారపడాల్సి వస్తోంది. కంపెనీలు సైతం వినియోగదారులకు సేవలు అందించేందుకు ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌లపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఆ రంగంలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. సాధారణ డిగ్రీలు పూర్తి చేసి ఆ తర్వాత కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్న వాళ్లు సైతం నాలుగంకెల జీతం పొందారు. నైపుణ్యం ఉన్న వాళ్లైతే ఏకంగా లక్షల్లో జీతాలు తీసుకున్నారు.
దీంతో కంప్యూటర్ డిగ్రీలకు విపరీతమైన డిమాండ్ పెరిగి, ప్రతి ఒక్కరూ అటువైపే మళ్లారు. కానీ సంవత్సరకాలంగా పరిస్థితి భిన్నంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఐటీ సంస్థలు నియామకాలు చేయడం లేదు. గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి చాలా మంది గ్రాడ్యుయేట్‌లను ఎంపిక చేసుకున్నారు. కానీ వాళ్లను ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోలేదు. కొన్ని కంపెనీలైతే ఉన్న ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి.
"సాఫ్ట్‌వేర్ రంగం వృద్ధిలోకి వస్తోంది. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగ నియమాకాలు తగ్గుతున్నాయి. ఇది తాత్కాలికం మాత్రమే. ఉద్యోగులు ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకొని తమ స్కిల్స్‌ను పెంచుకోవాలి. కృత్రిమ మేధపై పట్టు సాధిస్తే ఆ రంగంలో అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తద్వారా మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు పొందవచ్చు." -బీవీ మోహన్‌రెడ్డి, సైయెంట్ వ్యవస్థాపకుడు
కృత్రిమ మేధపై పట్టు సాధిస్తే :ఐటీ ఉద్యోగాలు తగ్గడానికి కృత్రిమ మేధ (ఏఐ) కూడా ఒక కారణం. పది మంది పనిచేసే స్థానంలో ఏఐ సాయంతో ఒకరిద్దరితోనే పని పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో దీనిపై పట్టున్న నిపుణులకు ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ కంప్యూటర్ కోర్సులతో పోలిస్తే కృత్రిమ మేధపై పట్టు సాధిస్తే ఆ రంగంలో అపార ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐటీ కంపెనీల యాజమాన్యాలు భరోసా ఇస్తున్నాయి.