ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ ఓటును లేపేసిన అధికారులు - భారీగా బోగస్ ఓటర్లకు చోటు? - AP 2024 Elections

Irregularities in Andhra Pradesh Voter List: మొదటిసారి తప్పుచేసి మానవ తప్పిదం అని మసిపూశారు. సరిదిద్దమంటే సాంకేతిక సమస్యలని మభ్యపెట్టారు. కానీ అంతిమంగా అవే తప్పులు పునరావృతం చేశారు. ఏపీ భవిష్యత్‌ను నిర్దేశించే ఓటరు జాబితాను తప్పుల కుప్పగా మార్చారు. ఆత్మలు, అపరిచితులకు ఓటు హక్కు కల్పించారు. అడ్రస్‌లేని వారికి ఏదో ఒక అడ్రస్‌ మీద ఓట్లు పుట్టించారు. వలసవెళ్లిన వారి పేర్లు జాబితాలో ఎక్కించారు. ఊరినే అంటిపెట్టుకుని ఉన్నవారి పేర్లు తీసేశారు. ఇలా ఒకటా రెండా ఏ జాబితా వెతికినా అక్రమాల గుట్టే. ఊరూరా లోపాల పుట్టే! ఈటీవీ భారత్- ఈటీవీ-ఈనాడు పరిశీలనలో ఓటరు జాబితా లోపభూయిష్టమని తేలింది.

Irregularities_in_Andhra_Pradesh_Voter_List
Irregularities_in_Andhra_Pradesh_Voter_List

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 8:28 AM IST

Updated : Feb 1, 2024, 9:28 AM IST

మీ ఓటును లేపేసిన అధికారులు - భారీగా బోగస్ ఓటర్లకు చోటు?

Irregularities in Andhra Pradesh Voter List : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాడిపేట హౌసింగ్‌ కాలనీలో ఎన్ని ఇళ్లకు తాళాలు పడ్డాయో.! కానీ ప్రతీ తలుపుపై చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడి స్టిక్కర్‌ అతికించారు. పాడిపేట హౌసింగ్‌ కాలనీ ఓటర్లకు చెందిన 322వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం జాబితాలో తప్పులు కుప్పలుగా కనిపిస్తున్నాయి. 360 మంది ఓటర్ల పేర్లు పరిశీలిస్తే అందులో 94తప్పులున్నాయి. 55వ బ్లాక్‌లో సాహో అనే వ్యక్తి పేరుతో ఓటు నమోదు చేశారు. కానీ అతనెవరో, ఎలా ఉంటాడో ఇరుగుపొరుగుకే తెలియదు. ఇక్కడ సాహోలాంటి 44 మంది అపరిచితుల్ని ఓటరు జాబితాలో చేర్చారు.

ఆత్మలే ఓటర్లు : చంద్రగిరి నియోజకవర్గానికే సంబంధించిన జాబితాను జాగ్రత్తగా పరిశీలించండి! పేరు ఒకటే. కానీ పోలింగ్‌ బూత్‌, చిరునామాలు మారిపోయాయి. మల్లకుంట్ల మహేశ్‌, బలరాముడు అనే వ్యక్తులకు పీలేరు నియోజకవర్గంలో ఒక ఓటు, చంద్రగిరి నియోజకవర్గంలో మరో ఓటుంది. కుసుమ, నందిని, నాగమణి అనే మహిళలకు తిరుపతి, చంద్రగిరి రెండుచోట్లా ఓట్లున్నాయి. తులసి అనే మహిళకు బూత్ నంబర్‌ 140లో 257, 701 సీరియల్‌ నంబర్లలో రెండు ఓట్లున్నాయి. మచ్చుకు పరిశీలిస్తేనే 17 డబ్లింగ్‌ ఓట్లు, 8 శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లూ ఉన్నాయి.

కొత్త ఓటరు జాబితాలోనూ అదే నిర్లక్ష్యం - అవే పాత తప్పులు!

Fake Votes in Andhra Pradesh :చెవిరెడ్డి ఇలాకాలో పావువంతుపైన ఇలాంటి అవకతవకలే! రాష్ట్రంలోమరెక్కడా లేని విధంగా కొత్త ఓట్ల నమోదు కోసం కేవలం 9 నెలల వ్యవధిలో 49 వేల 956 దరఖాస్తులు అందడం ఇక్కడి అక్రమాలకు నిదర్శనం. సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఒకరికొకరికి పరిచయాలు ఉండవు. అదే అదునుగా అపరిచిత వ్యక్తుల పేరుతో ఫాం-6లు పెట్టి భారీగా దొంగ ఓట్లు చేర్పించారనే ఫిర్యాదులున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పాతపేటలోని 133వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో 36 ఓట్లు ఆత్మలవే.! ఎప్పుడో మరణించిన కుప్పుస్వామి పేరు కొనసాగించారు.! కానీ బతికున్న ఆయన తండ్రి నాగరాజుకు ఓటు తీసేశారు.

ఊరిపేరులేని ఓటర్లను అన్ని జిల్లాల జాబితాల్లో పుట్టించారు అక్రమార్కులు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని 46వ పోలింగ్‌ కేంద్రం సీరియల్‌ నంబర్‌ 24లో రవికుమార్‌ కల్లం అనే పేరుంది. ఆయన ఎవరో స్థానికులకే తెలియదు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం అంబేడ్కర్‌ నగర్‌ జాబితాలో డోర్‌ నంబర్‌ 12-58తో అభిషేక్‌ అనే పేరుంది. ఆయన ఎలా ఉంటారని స్థానికులే ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి.

ఓట్ల అక్రమాలపై కొరడా ఝుళిపిస్తున్నా మారని అధికారుల తీరు - టీడీపీ నేతల మండిపాటు

బాపట్ల జిల్లా వేటపాలెంలోని 194వ పోలింగ్ కేంద్రం ఆరుగురు, 193వ పోలింగ్ కేంద్రంలో ఏడుగురు మృతులకు ఓట్లు ఉన్నాయి. అద్దంకిలోని 168, 169 పోలింగ్ కేంద్రాల్లో 20 మంది మృతులకు ఓట్లు, ఐదు డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదల బేత్లహాంనగర్‌ పోలింగ్‌ కేంద్రంలో మొత్తం 18 అపరిచిత ఓట్లున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ ఓటరు జాబితాలోనూ తప్పులు కోకొల్లలు! డోకిపర్రుకు చెందిన సోమగాని గిరిరాజు చనిపోయినా అతని ఓటు తొలగించలేదు.

అదే గ్రామానికి చెందిన షేక్‌ గుల్జార్‌ భాను తన ఓటును వేరేచోటుకు బదిలీ చేయించుకున్నారు. కానీ మొదటి ఓటు తీసేయకండా రెండుచోట్లా కొనసాగించారు. ఇక్కడ చూడండి కాగిత సాయి రజినికి రెండు ఓట్లు కేటాయించారు. గుడివాడ 20వ వార్డుకు చెందిన నల్లూరి రామకృష్ణకు ముసాయిదా బాబితాలో ఓటుంది. కానీతుదిజాబితాలో మాయమైంది. ఇతను తెలుగుదేశం బూత్‌ ఇంఛార్జ్‌...! తెలుగుదేశం మద్దతుదారుల ఓట్లు కావాలనే తీసేయడానికి ఇంతకుమించిన సాక్ష్యం ఏంకావాలని ఆక్రోశిస్తున్నారు రామకృష్ణ.

పూర్తికానీ భవనంలో 33 ఓట్లు : ఇక పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓట్ల అక్రమాలు చూస్తే విస్తుపోవాల్సిందే. ఇంకా నిర్మాణమే పూర్తికానీ భవనంలో 33 మంది నివసిస్తున్నారంటూ ఓట్లు పుట్టించారు. డోర్ నంబర్‌ 10-1-1గా పేర్కొన్నారు. ఈ బహుళ అంతస్థుల భవనం ఎవరిదో కాదు! నరసరావుపేట సీటు తనకే కావాలంటున్న వైసీపీ నేత గజ్జెల బ్రహ్మారెడ్డిది. ముసాయిదా ప్రతిపక్ష పార్టీలు ఈ దొంగ ఓట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రక్షాళన చేయకుండా పాపం మూటగట్టుకున్నారు.

అక్రమాలకు 'తలుపు'తెరిచారు :నెల్లూరు అర్బన్‌ నియోజకవర్గంలో అసలు ఓట్లతో నకిలీ ఓట్లు పోటీపడుతున్నాయి. 26-2-274నంబర్‌తో ఉన్న ఈ ఇల్లు చూడండి. ఉంది రెండతస్థులు. అదీ పెద్ద విశాలమేమీ కాదు. కానీ ఇందులో ఏకంగా 50కిపైగా ఓట్లు చేర్చారు. ఈ జాబితాలోనూ అవే అక్రమాలు..! 26-13-342 ఇంటి నంబర్‌ పేరుతో ఏకంగా పది ఓట్లు చేర్చారు.

తుప్పల్లో 250 ఓట్లా? :శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీసు క్వార్టర్స్‌లో శిథిలమై కొన్నేళ్లవుతోంది. ఇప్పుడా చిరునామాలో ఉంటోంది పిచ్చిమొక్కలే. పోలీసులు, వారి కుటుంబీకులు కూడా ఖాళీ చేసేసి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఎన్నికల సంఘం లెక్కల్లో మాత్రం అక్కడే ఉన్నారు. అక్కడున్న డోర్‌ నంబర్లతో ఏకంగా 250 ఓట్లున్నాయి. వారంతా ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.! ఇంతకుమించిన అక్రమమేమైనా ఉంటుందా?

అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బెన్నవోలులోని 170వపోలింగ్‌ కేంద్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పరుచుకున్న 12మందికి ఓట్లున్నాయి. వీరంతా గ్రామంలోని వైసీపీ సానుభూతిపరులు బంధువులు, కుటుంబీకులే. ఎన్నికలప్పుడు వాళ్లు వచ్చి ఓటేస్తారో? వీళ్లే ఓటేసుకుంటోరో తెలియని పరిస్థితి. నర్సీపట్నం ఓటరు జాబితాలో మృతుల పేర్లు భారీగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి.

ఒక్కొక్కరికి రెండేసి!‌ :విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం చాకివలసలోని 219వ పోలింగ్‌ కేంద్రంలో నక్క విజయకు 652, 661 సీరియల్‌ నంబర్లతో రెండు ఓట్లున్నాయి. ఇప్పలి పావని కుమారికి సైతం 333, 653 సీరియల్‌ నంబర్లతో రెండేసి ఓట్లున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం మాదలింగి ఓటర్ల జాబితాలో 8 మందికి రెండు ఓట్లున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం కొండమాచుపల్లెలోని 56వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో పదుల సంఖ్యలో రెండేసి ఓట్లున్నాయి.

మృతిచెంది మూడేళ్లైనా ఓటు :ఇది తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని హోంమంత్రి తానేటి వనిత స్వగ్రామం యర్నగూడెం. ఇక్కడి 83వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రం జాబితాలో ఓటరుగా ఉన్న కలగల భరత్‌కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెంది మూడేళ్లవుతోంది. ఐనా జాబితాలో అతని పేరు కొనసాగిస్తున్నారు. ఇలా ఒకరిద్దరివి కాదు ఏకంగా 14 మంది మృతుల పేర్లు ఉంచారు.

ఆత్మలకు ఓటు :అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో మృతుల ఓట్లను ఎన్నికల సంఘం అధికారులు సజీవంగా ఉంచారు. అయినాపురంలో 23 మంది, తాళ్ళరేవు మండలం మాధవరాయుడుపేట లోని 226 పోలింగ్‌ బూత్‌లో 46 మంది, 227వ బూత్‌లో 25 మంది, 223 బూత్‌లో 20 మంది చనిపోయిన వారి పేర్లున్నాయి.

ఓట్ల అక్రమాలు 'అనంతం' :ఇక అనంతపురం జిల్లాలో ఓట్ల అక్రమాలు అనంతం. రాప్తాడు MLA ప్రకాశ్ రెడ్డి సొంతూరు తోపుదుర్తిలో 180 మంది ఓటర్ల గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంటే స్థానికేతరుల్ని ఓటర్లుగా చేర్చారు. రాప్తాడు బీసీ కాలనీలోని 137వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రంలోనూ స్థానికేతర ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం చదళ్ల గ్రామంలో 1359 ఓట్లు ఉండగా ఓటరు జాబితా సవరణలో BLOలు పక్షాపాతం చూపారనే విమర్శలున్నాయి. ఊరొదిలి వెళ్లిపోయిన వందమందిని జాబితాలో చేర్చారు. పెళ్లై అత్తారిళ్లకు వెళ్లిపోయిన 27 మంది యువతుల పేర్లు తొలగించాలని గ్రామస్తులు ఫారం-7 అప్లై చేశారు. కానీ రేణుక అనే ఒక్క మహిళ పేరు మాత్రమే తీసేసి మిగతావన్నీ కొనసాగించారు.

ఈటీవీ భారత్ క్షేత్రస్థాయిలో పరిశీలన : ఇలా ఓటరు జాబితాలో తవ్వేకొద్దీ అక్రమాలే. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితాను ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 26 జిల్లాల పరిధిలో ఒక్కో జిల్లా నుంచి ఒక్కో పోలింగ్‌ కేంద్రాన్ని ఎంపిక చేసుకుని ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఏ పేజీ తిప్పినా లొసుగులే! మొత్తం 25 వేల 820 మంది ఓటర్ల పేర్లు పరిశీలించగా వాటిల్లో 1,262 పేర్లకు సంబంధించి లోపాలు బయటపడ్డాయి. వాటిలో 273 మృతుల ఓట్లుంటే వలస వెళ్లిన వారు, స్థానికంగా నివసించని వారి పేరుతో 540 ఉన్నాయి.

డబ్లింగ్‌ ఓట్లు 66, అపరిచితుల ఓట్లు 120, ఇతర అవకతవకలతో కూడిన ఓట్లు 263 వరకూ తేలాయి. అంటే పరిశీలించిన కొద్ది ఓట్లలో 4.88 శాతం అవకతవకలే! ఇక మొత్తం జాబితాను జల్లెడపడితే లోపాల చిట్టా పొడవు విజయవాడ నుంచి దిల్లీ నిర్వాచన్‌ సదన్‌ వరకూ పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్ల తేడాతోనూ గెలుపోటములు తారుమారవుతుంటాయి. కానీ 4 శాతం ఓటరు జాబితాలోతప్పులుంటే ఇక నిస్పాక్షిక ఎన్నిక సాధ్యమేనా? ముసాయిదా జాబితానే లోపభూయిష్ఠమని ప్రతిపక్షపార్టీలు, ప్రసారమాధ్యమాలు మొత్తుకున్నా లోపాలు సరిదిద్దకపోవడం నిర్లక్ష్యమా? అక్రమాలకు కొమ్ముకాయడమా? అధికారపార్టీకి తొత్తులుగా మారిన అధికారులే చెప్పాలి.

రాష్ట్రాన్ని దొంగ ఓట్ల రాజ్యంగా మార్చిన జగన్​ - దేశ ద్రోహంగా పరిగణించాలి : TNSF

Last Updated : Feb 1, 2024, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details