Internet Connection In Telangana : రాష్ట్రంలోని పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ.300కే ఇంటింటికీ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని లక్షల ఇళ్లకు దశలవారీగా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది. ఇది వైఫై కనెక్షన్ లాంటిది. ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్‌వర్క్‌తో పాటు టెలిఫోన్, పలు తెలుగు ఓటీటీలను గ్రామీణ ప్రజలు తిలకించవచ్చు. మొదటి విడతలో భాగంగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం దీనిని ప్రారంభిస్తారు. తర్వాత మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు.
దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా తెలంగాణకు రూ.2,500 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్‌ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను టీ ఫైబర్ సంస్థకు అప్పగించింది.
టీవీనే కంప్యూటర్‌గా: రూ.300కే ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ కనెక్షన్ తీసుకుంటే టీవీని కంప్యూటర్‌గా వాడుకోవచ్చు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ కనెక్షన్ ద్వారా చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. గ్రామంలోని అన్ని కార్యాలయాలకు, స్కూళ్లకు కూడా ఈ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.