Northern RRR Road Interchange Construction : రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగంలో నిర్మించనున్న నాలుగు వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా హైదరాబాద్‌తోపాటు నగర శివారులోకి కూడా వెళ్లకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్లవచ్చు. దీంతో అంతర్రాష్ట్ర వాహనాలకు సమయం ఆదా కావడంతోపాటు దూరాభారం కూడా తగ్గనుంది.
దీని ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో అంతర్రాష్ట్ర వాహనాల తాకిడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్‌గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారితో అనుసంధానం కానున్న జిల్లాల్లోనూ వ్యాపారం రంగం మరింత వృద్ధి చెందనుంది. ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనున్నారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం పనులు మొత్తం ఐదు ప్యాకేజీల్లో చేపడుతున్నారు. మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల మీదుగా భారత్‌మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా ఎన్‌హెచ్‌ఏఐ దీన్ని నిర్మించనుంది.