Road Accidents Increasing Day by Day More :వాహన వేగం ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయుర్ధాయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్లి చాలా మంది ప్రాణాల మీదికు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఉదంతాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
అతివేగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 11,90,000 మరణాలు సంభవిస్తున్నాయి. సుమారు 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా రోడ్డు ప్రమాదాలలోనూ అగ్రస్థానంలో ఉంది. అక్కడ రోజుకు 19,937 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అమెరికా కథనాలు తెలిపాయి.
High Speed Injurious to Life : జపాన్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కాగా నార్వే, స్వీడన్ వంటి దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ దేశాల్లోని డ్రైవర్లు రోడ్డు నియమనిబంధనలు పాటించడం, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం వల్లనే ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి. భారత్‌లోనూ రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో 19మంది మృత్యువాత పడుతున్నారని వివరించింది. సంవత్సరానికి దాదాపు లక్షా 68వేల నిండు ప్రాణాల్ని ప్రమాదాలు కబళిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రహదారులు నెత్తురోడటానికి, రెప్పపాటులో మృత్యువు కాటేయడానికి ముఖ్యకారణం అతివేగమే కారణమని చాలా నివేదికలు చెబుతున్నాయి.
మానవ తప్పిదాలే అధిక రోడ్డు ప్రమాదాలకు కారణం :అతివేగంతో పాటు వాహనం తోలుతూ ఫోన్‌లో మాట్లాడటం, వీడియోలు చూడటం, మద్యం మత్తు, నిద్రలేమి వంటివి నడిరోడ్డుపై మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. 2030 సంవత్సరం నాటికి దేశంలో జరుగుతున్న ప్రమాదాలను సగం వరకు తగ్గిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పలు సందర్భాల్లో ప్రకటించారు.
ఇప్పటికే రష్యా, జపాన్, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలు రోడ్డు ప్రమాదాల్లో అరికట్టడంలో నూతన పద్ధతులు అవలంబించి సగానికి పైగా ప్రమాదాలను తగ్గించాయని నిపుణులు చెబుతున్నారు. మరో 35దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా దేశాలన్నీ విజన్ జీరో పేరుతో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అడుగులేస్తున్నాయి.
India Road Accidents Death Toll :విజన్ జీరోను మొదటిసారిగా 1997లో స్వీడన్ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2050నాటికి తమ రోడ్లపై మరణాల్ని, తీవ్ర గాయాల్ని సున్నా స్థాయికి చేర్చాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్ ప్రభుత్వాలు రహదారి ప్రమాద కారకుల జరిమానాలు విధించి ప్రమాదాలు తగ్గించే పనిలో పడ్డాయి.
జర్మనీలో పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనల్ని లెక్కించి ఒక దశ దాటాక లైసెన్సును రద్దు చేసే కంప్యూటరైజ్డ్ విధానం అమలవుతోంది. ఇంకా చాలా దేశాలు అతివేగాన్ని గుర్తించడానికి స్పీడ్ కెమెరాల్ని వినియోగిస్తున్నాయి. ఈ తరహా పద్ధతులను పాటించే రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా అడుగులేస్తామని కేంద్రం చెప్తున్నప్పటికి వాటి అమలుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో స్పష్టత లేదు.