8 Youth Got Teacher Jobs From Same Village :ఆ ఊరిలో నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు మొత్తం 8 మంది విద్యార్థులు ఒకేసారి ఉపాధ్యాయ నియామాక పత్రాలను అందుకున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఎంపిక నియామక పత్రాలు అందుకున్నారు. వీరంతా గత పదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఒకే గ్రామం నుంచి 8 మంది ఎంపిక :కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు పట్టుదలతో చదివి డీఎస్సీకి ఎంపికై ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించారు. వీరందరికి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 11 వేల 62 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. అందులో చెన్నారావు పేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది మంది కూడా ఉన్నారు.
విజేతలను ఘనంగా సన్మానించిన గ్రామస్థులు :తమ గ్రామం నుంచి ఒకేసారి ఎనిమిది మందికి టీచర్ ఉద్యోగాలు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. దసరా వేళ వారి సంబరం మరింత పెరిగింది. తమ ఊరికి ఇంత పేరు తీసుకొచ్చిన 8 మంది ఉపాధ్యాయులను, వారి తల్లిదండ్రులను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.