Heavy Temperatures in Telangana :భానుడి భగభగలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటకు వేయాలంటేనే జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరో భయంకరమైన విషయం ఏంటంటే దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలోనే నమోదు అవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు సూర్యుడి ప్రతాపం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
ఈ మేరకు గురువారం కొత్తగూడెంలో 44 డిగ్రీలు దేశంలోనే అత్యధికమని ప్రకటించిన వాతావరణ శాఖ, ఆ తర్వాత శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం గమనార్హం. పదేళ్లలో ఏప్రిల్ నెల చివరి వారంలో ఒకేసారి ఇలా ఇన్ని కేంద్రాల్లో ఎండలు చూడటం తొలిసారి. సూర్యుడి ప్రతాపానికి సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం అచ్చన్నపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా పని చేస్తున్న బిహార్‌కు చెందిన వ్యక్తి శుక్రవారం వడదెబ్బ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
హెచ్చరికలు జారీ : కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, యాదాద్రి, జగిత్యాల, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో 45 డిగ్రీల ఎండ దాటడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. మరో 25 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను ప్రకటించింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఐదురోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. అందులో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 వరకు బయటకు రావద్దని సూచించింది.
ఇప్పటికే పలు జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వచ్చే ఐదు రోజులు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తేల్చింది. మరోవైవు దక్షిణ మధ్యప్రదేశ్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడడంతో ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.