Illegal Mining of Pond Soil in Miryalaguda : మట్టి బకాసురులు చెరువులను చెరబడుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో స్థానిక నాయకులు చెరువులలో మట్టిని తోడేస్తున్నారు. స్థిరాస్తి వెంచర్లు, ఇటుకల బట్టీలు, రోడ్ల నిర్మాణానికి మట్టి తరలిస్తున్నారు. ఆ విధంగానే జేబులు నింపుకుంటున్నారు. ఒక్కో ట్రక్కు రూ.4000 నుంచి 5000 రూపాయల వరకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వేములపల్లి, మిర్యాలగూకడ, అడవిదేవులపల్లి, దామరచర్ల, మాడుగులపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయి.
ఇదే అదునుగా జేసీబీలు పెట్టి మట్టిని తవ్వేస్తున్నారు. మట్టిని తరలించడానికి మైనింగ్ అనుమతులు తీసుకోవాల్సిన ఉంటుంది. దీనివల్ల పంచాయతీలకు, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూరుతుంది. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చింతపల్లి చెరువులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
ఫిర్యాదు చేస్తే పట్టించుకోని అధికారులు : అడవిదేవులపల్లి మండలంలోని టెయిల్పాండ్ నుంచి ఇటీవల నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించారు. బ్యాక్ వాటర్ తగ్గిపోవటంతో మట్టి, ఇసుక తేలింది. ఇదే అదనుగా అక్రమార్కులు దందాకు తెర లేపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. టెయిల్పాండ్ నుంచి మట్టిని తరలిస్తున్న విషయం నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి రాలేదని వారు బెచున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.