తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంత ఎక్కువ డబ్బులిస్తే ప్రాక్టికల్స్​లో అన్ని ఎక్కువ మార్కులు! - వైద్య కళాశాలల్లో భారీగా వసూళ్లు - PRACTICAL EXAMS IN MEDICAL COLLEGES

వైద్య కళాశాలల్లో భారీగా వసూళ్లు - పీజీలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు - కాళోజీ ఆరోగ్య వర్సిటీకి భారీగా ఫిర్యాదులు

Practical Exams In Medical Colleges
Practical Exams In Medical Colleges (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 7:25 AM IST

Practical Exams In Medical Colleges :వైద్య విద్యలో థియరీతో పాటు ప్రాక్టికల్స్‌ అత్యంత ముఖ్యం. వీటిలో తగిన శిక్షణ తీసుకొని ఉత్తీర్ణులైతేనే వారు సరైన వైద్యం చేయగలరు. ఇంతటి ముఖ్యమైన ప్రాక్టికల్స్‌లో అవినీతి జరుగుతుంది. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని పాస్ మార్కులు వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీజీ విద్యార్థులైతే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఎంబీబీఎస్ వారు ప్రతి సబ్జెక్టు ప్రాక్టికల్స్​కూ రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ చెల్లించాల్సి వస్తుంది. సబ్జెక్టు, కళాశాలను బట్టి రేటు ఉంటుంది.

అవకతవకలు జరుగుతున్నాయని తేలితే :ప్రాక్టికల్స్​లో ఇతర కళాశాలల నుంచి వచ్చే ఎగ్జామినర్లకు లంచాలు ఇవ్వడం పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రాక్టికల్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయని తేలితే ఆ వైద్య కళాశాలలను బ్లాక్‌లిస్టులో పెట్టి, అక్కడ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించకుండా నిషేధిస్తామని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజాగా హెచ్చరించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల ప్రధానాచార్యులకు ఉత్తర్వులు జారీ చేసింది.

  • దక్షిణ తెలంగాణలో ఒక వైద్య కళాశాలలో ప్రాక్టికల్స్ పరీక్షకు పీజీ విద్యార్థుల నుంచి రూ. 2లక్షల చొప్పున వసూల్ చేస్తున్నారు. విద్యార్థులు యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తామంటే ఒప్పుకోవట్లేదు. కేవలం నగదు రూపంలో కట్టించుకుంటున్నారు.
  • కరీంనగర్ జిల్లాలోని ఒక కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ప్రాక్టికల్స్ పేరుతో రూ.10వేల నుంచి 20వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రాక్టికల్స్​లో ఫేల్ చేస్తామంటూ బెదిరించారని కొందరు విద్యార్థులు కాళోజీ ఆరోగ్య వర్సిటీకి ఫిర్యాదు చేశారు.
  • రంగారెడ్డి జిల్లాలోని ఒక వైద్యకళాశాలలో రాత్రి 10 గంటల వరకూ ప్రాక్టికల్స్ నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు డబ్బులు ఇవ్వడం ఆలస్యం కావడంతో ప్రాక్టికల్స్ నిర్వహణలో జాప్యం చేసినట్లు తెలిసింది.

ఎగ్జామినర్లకు నజరా ఇచ్చేందుకు అక్రమ వసూళ్లు : ప్రాక్టికల్స్​లో ఒక్కో సబ్జెక్టుకు నలుగురు ఎగ్జామినర్లు అవసరమవుతారు. వీరిలో ఇద్దరు అదే వైద్య కళాశాలకు చెందిన వారు ఉంటారు. పీజీలో అయితే ఇతర కళాశాలల నుంచి ఇంకొకరు ఇతర రాష్ట్రం నుంచి వస్తారు. ఎంబీబీఎస్‌లో ఇద్దరు రాష్ట్రంలోని ఇతర కళాశాలల నుంచి వస్తారు. ఇలా బయట నుంచి వచ్చే ఎగ్జామినర్లకు నజరానాలు ఇచ్చేందుకు విద్యార్థుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆరోగ్యవర్సిటీ ఇచ్చే టీఏ, డీఏలతో సరిపెట్టుకోకుండాతమకు ఫైవ్​స్టార్ హోటళ్లు కావాలని కొంత మంది ఎగ్జామినర్లు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ వసూళ్లు :దీంతో కొన్ని ప్రైవేట్ కళాశాలలు వారికి సకల వైభోగాలు అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ వైద్యకళాశాలలు అతిథిగృహాల్లోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రైవేటు కళాశాల జనరల్‌ సర్జరీ విభాగంలోని 10 మంది పీజీ విద్యార్థుల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.50 లక్షలు వసూలు చేసింది. వీటిలో సగం బయటి ఎగ్జామినర్లకు ఇచ్చి, మిగిలిన డబ్బును ఆ కళాశాల ప్రొఫెసర్లే పంచుకున్నారని సమాచారం. కొన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయి.

వారికి ముడుపులు వీరికి మార్కులు : పైసల మోజుతో కొందరు ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రొఫెసర్లు ప్రైవేటు కళాశాలలకు ఎగ్జామినర్లుగా వెళ్లేందుకు యూనివర్సిటీలో భారీగా పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు పీజీ విద్యార్థులు కూడా వారెవరో ముందుగానే తెలుసుకుని వారితో నజరానాలు మాట్లాడుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ప్రాక్టికల్స్‌లో 90-95 శాతం మార్కులొచ్చేలా మాట్లాడుకున్నట్లు సమాచారం.

అక్రమంగా అధిక మార్కులు : ఇలా అధిక శాతం మార్కులు సంపాదించినవారు నీట్‌లోనూ మంచి ర్యాంకును సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువ. నీట్‌లో ఇద్దరికి సమాన మార్కులొచ్చినప్పుడు వారు డిగ్రీ లేదా పీజీలో సాధించిన మార్కులను బట్టి మెరుగైన ర్యాంకు ఇచ్చే విధానం ఉంది. దీనివల్ల నిజాయతీగా చదివి ఉత్తీర్ణులైన విద్యార్థులు నష్టపోతారు. ఎంబీబీఎస్‌ అర్హతతో ప్రభుత్వ వైద్యులను నియమించేటప్పుడు కూడా అక్రమంగా అధిక మార్కులు సాధించినవారే లబ్ధి పొందే అవకాశాలుంటాయి.

మాకు కాస్త ప్రమోషన్ ఇవ్వరూ! - 35 ఏళ్లుగా పని చేసినా ఒక్క పదోన్నతీ లేదు

డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారా? - ఈ కాలేజీల్లో సీటు ఫ్రీ

ABOUT THE AUTHOR

...view details