Police Raids On Pubs: హైదరాబాద్ మహానగరంలో గచ్చిబౌలి వంటి ఖరీదైన ప్రాంతంలో పబ్‌కు ఒంటరిగా వెళ్లారా మీ పని అంతే. కాస్త ‘రిలాక్స్’ అవ్వాలనుకునేంతలో అందమైన అమ్మాయి వచ్చి వలపు వల విసిరి చివరకు విలవిలలాడేలా చేస్తుంది. హాయ్ అంటూ పలకరిస్తుంది. చిరునవ్వుతో మీ వివరాలు ఆరా తీస్తుంది. మాటలతో మాయచేసి వలపు వాకిట్లోకి తీసుకెళ్తోంది. ఇక ఛీర్స్, డ్యాన్స్, రొమాన్స్ అంటూ ఊరిస్తుంది. ఆ మత్తు మాయలో నుంచి వలపు కౌగిల్లో నుంచి తేరుకునేలోపు పబ్ ఓనర్ వచ్చి మీ చేతిలో వేల రూపాయల బిల్లు పెడతాడు. ఇదంతా నేనెప్పుడు ఖర్చు చేశానని మీరు తలపట్టుకునే లోగానే ముక్కు పిండి మరీ ఆ బిల్లు వసూల్ చేస్తారు. ఇలా అమాయకుల నుంచి వేల రూపాయలు కాజేస్తున్న వైనం హైదరాబాద్ పబ్బుల్లో వెలుగుచూస్తోంది.
హైదరాబాద్ మహానగరంలోని పబ్బులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న వాటి పై కొరడా ఝుళిపిస్తున్నారు. జాబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని పబ్‌లపై పలుమార్లు నిర్వహించిన దాడుల్లో అతిక్రమణలు బయటపడ్డాయి. ఈ మేరకు పోలీసులు ఆయా పబ్బుల పై చర్యలకై ఉపక్రమించారు. యాజమాన్యాలతో పాటు కొందరు యువతులు, పబ్‌కు వచ్చిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే పబ్‌ల లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు.
అనుమతులు ఎక్కడ? : తాజాగా బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 3 లో టాస్ పబ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో నిబంధనల అతిక్రమణ బహిర్గతమైంది. ఈ పబ్‌లో యువతి, యువకుల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. బార్, రెస్టారెంట్‌కు మాత్రమే అనుమతి ఉండగా పబ్ నిర్వహిస్తున్నట్టు బయటపడింది.