Hydra Operations In Hyderabad :చిన్న చినుకుకే చిత్తడి! కాలనీలు, బస్తీల్లో మోకాళ్ల లోతు నీళ్లు!చెరువులను తలపించే రోడ్లు పిల్ల కాలువలను మరిపించే వీధులు!కాలానికి అతీతంగా హైదరాబాద్ మహానగరంలో కనిపించే దృశ్యాలివి! కానీ, దీనికి కారణమేంటి? అంటే వరద నీటిని మోసుకెళ్లే నాలాలు, వాన నీటితో నిండాల్సిన చెరువులు, కుంటలను కబ్జాలకు గురికావడమే కదా. అక్రమార్కుల అత్యాశకు, అవినీతి అధికారుల ధన దాహానికి చెరువులు కుంటలు కబ్జాకు గురి కావడంతోనే వరద నీరు నగరాన్ని ముంచెత్తు తుంది. నీటి వనరులను నామరూపాలు లేకుండా చేసి భారీ భవనాలు, కాలనీలు వెలుస్తుండటంతో వాటి మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది.
చెరువుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రాని ప్రభుత్వం ఈ మధ్యే ఏర్పాటు చేసింది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైడ్రా చెరువుల కబ్జాలు, అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది. ఈ మేరకు గ్రేటర్‌తో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న 56 చెరువులు, కుంటలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం ఆధారంగా ముందుకెళ్లేందుకు హైడ్రా సిద్ధమైంది.
ఎన్ఆర్ఎస్సీ అధ్యయనంలో కనివినీ ఎరగని స్థాయిలో జరిగిన జలవనరుల విధ్వంసం బయపడింది. 44 ఏళ్ల కింద 10 వేల 461 ఎకరాల్లో విస్తరించిన జలవనరులు గతేడాది చివరికి 3 వేల 974 ఎకరాలకు తగ్గింది. అందులో దాదాపు 61 % చెరువులు మాయమవ్వగా 39 % మాత్రమే మిగిలినట్లు తేలింది. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకరంగా మారనుందని హైడ్రా భావిస్తోంది.
ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ వివరాలతోపాటు 2005 నుంచి 2020 వరకు గూగుల్ మ్యాప్‌లు పరిశీలించిన హైడ్రా చెరువుల విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేసింది. 4ఏళ్లలో చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం, బఫర్‌జోన్ల ప్రాంతాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. చెరువులు కుంచించుకుపోయి వాటిలోకి వెళ్లాల్సిన వరద నీరు దారి మళ్లీ నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నట్లు తేల్చింది. జీహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను పరిశీలిస్తే ఎంతటి విఘాతం కలుగుతుందో అర్థమవుతుంది.
జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 7వేల 139 ఎకరాల ఎఫ్టీఎల్ ఉండగా 2014లో 592 ఎకరాలు, 2020లో 592ఎకరాల ఎఫ్టీఎల్ ఆక్రమణలకు గురైంది. 1250ఎకరాల బఫర్‌జోన్ ఉండగా 2014లో 327ఎకరాలు, 2020లో 415ఎకరాల భూమి కబ్జాకోరల్లో చిక్కుకుంది. అలాగే 2014లో 6వేల 235, 2020లో 8వేల 822 అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. బఫర్‌జోన్‌లోనూ 2014లో 3వేల 872, 2020లో 5వేల 957 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు హైడ్రా తేల్చింది.
ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో కీసర మండలం తుమ్మలకంట చెరువు, బతుకమ్మకుంటలు నామ రూపాల్లేకుండా పోయాయి. కుంట్లూరు చెరువు 90%, ఉప్పల్ నల్ల చెరువు 90%, కొంపల్లి చెరువు, 88%, జిల్లెలగూడ చెరువు 85 %, బండ్లగూడ చెరువు 83 %, ఫిర్జాదిగూడ చెరువు 73%, సఫిల్‌గూడ చెరువు 66 %, సరూర్‌నగర్ చెరువు 56%, నాగోల్‌చెరువు 41 %, మీరాలం చెరువు 32 %, జల్‌పల్లి చెరువు 31 %, కాప్రా చెరువు 27%, జీడిమెట్ల ఫాక్స్ సాగర్ 22 % ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్ నగరానికి తలమానికమైన నిలిచే హుస్సేన్ సాగర్ సైతం 21% కబ్జా అయినట్లు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది.