Traffic Advisory Issued By Police :హైదరాబాద్-విజయవాడ మార్గంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం రాత్రి వాహనాల రద్దీ నెలకొంది. శని, ఆదివారాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. గత ఏడాది భోగికి ముందు రోజు దిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్‌కు చేరుకోవడానికే 3-4 గంటల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఈ రహదారి మీదుగా పలు ప్రాంతాలకు వెళ్లే వాహనదారుల సౌలభ్యం కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు పోలీసుల కీలక సూచనలు :సాధారణ రోజుల్లోదిల్‌సుఖ్‌నగర్ నుంచి చౌటుప్పల్‌కు ఒక గంటలోనే చేరుకోవచ్చు. కానీ నిరుడు భోగికి ముందు రోజున 3-4 గంటల సమయం పట్టింది. ఈసారి పండుగకు అదే స్థాయిలో రాకపోకలు సాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీన్ని నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచే హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఇరువైపులా కలిపి 16 టోల్ బూత్‌లు ఉండగా, విజయవాడ మార్గంలోనే పదింటిని తెరవడం గమనించదగ్గ విషయం.
శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉండే అవకాశముంది. పైగా ఆదివారం చౌటుప్పల్‌లో సంత జరుగుతుంది. అప్పుడు హైవేపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. మరోవైపు చౌటుప్పల్‌లో అండర్‌పాస్ నిర్మాణం జరుగుతుండటంతో రాకపోకలకు ఇప్పటికే సమస్యగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సంక్రాంతికి వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.
గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు ఇలా :హైదరాబాద్ నగరం నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి-అద్దంకి నేషనల్ హైవేపై ప్రయాణిస్తుంటారు. వీరు విజయవాడ హైవేపై వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకొనేందుకు అవకాశముంది. దీనికి ప్రత్యామ్నాయంగా కొంతదూరం పెరిగినా హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే వాహనచోదకులు ఓఆర్‌ఆర్ పైకి వెళ్లి, బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని, నాగార్జునసాగర్ హైవేలోకి వెళితే సరిపోతుంది.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారికి ఇలా :ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్‌పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్లే. ఎందుకంటే నార్కట్‌పల్లి నుంచి కొన్ని వాహనాలు మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా దాటాక ఇంకొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు, మిగతావి విజయవాడ వైపు వెళ్లడంతో మిగతా రెండు టోల్గేట్ల వద్ద పెద్దగా ట్రాఫిక్‌జామ్ అయ్యే అవకాశం లేదు.హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లే ప్రయాణికులు ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్ తీసుకుని, వరంగల్ హైవేలోకి ప్రవేశించొచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి చేరుకోవచ్చు.
గంటలోపే నగరాన్ని దాటి వెళ్లే అవకాశం :సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్! హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న వెహికిల్స్‌కు శుక్రవారం నుంచి విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్తున్నందున, ట్రాఫిక్ రద్దీ వేళల్లో ఒక్కోసారి 2-3 గంటల సమయం పట్టేది.
ఇకపై ఈ రద్దీ కష్టాలు తీరనున్నాయి. విజయవాడ శివారులోని గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర కొత్తగా 6 వరుసల బైపాస్ నిర్మాణానికి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 90 శాతానికి పైగా వర్క్స్ పూర్తయ్యాయి. అక్కడక్కడ విద్యుత్తు హైటెన్షన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ, వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది లేదని గుర్తించినటువంటి అధికారులు సంక్రాంతి రద్దీ దృష్ట్యా శుక్రవారం నుంచే రెండు వైపులా రాకపోకలకు అనుమతిస్తున్నారు. గొల్లపూడి- చిన్నఅవుటపల్లి మార్గంలో ప్రయాణానికి గంటలోపే సమయం పడుతుంది. త్వరలోనే ఈ మార్గంలో పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతించేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కిక్కిరిసిన హైదరాబాద్ - విజయవాడ హైవే - ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్
సంక్రాంతి రద్దీకి తగ్గట్లు మారిన వందేభారత్ - విశాఖ ట్రైన్‌కు అదనపు కోచ్‌లు