Stock Investment Cyber Fraud in Hyderabad: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు టెలిగ్రామ్ యాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి అవగాహన కల్పించి భారీగా లాభాలొచ్చేలా చేస్తామని నమ్మించారు. మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తరఫున మాట్లాడుతున్నట్లు చెప్పారు. నిజమేనని నమ్మిన బాధితుడు ముఠా చేతికి చిక్కి రూ.1.03 కోట్లు పోగొట్టుకున్నాడు.
తాను మోసపోయినట్లు గుర్తించిన భాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడి నుంచి ముఠా కొట్టేసిన సొమ్ము ఏ బ్యాంకు ఖాతాల్లోకి చేరిందో ఆరా తీయగా జోధ్‌పుర్‌కు చెందిన రామచంద్ర అలియాస్ గణేశ్‌రాం పేరు బయటపడింది. అతడిని విచారించగా తాను 5 శాతం కమీషన్ కోసం షెల్ కంపెనీల పేరిట బ్యాంకు ఖాతాలు మాత్రమే సమకూరుస్తానని వెల్లడించాడు.
సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి? - సైబర్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? - Cyber Crime EXPERT Dhanya Menon
Investment Cyber Gang Arrested In Hyderabad : జోధ్‌పుర్‌కే చెందిన భూరారామ్ బనేవాల్ అలియాస్ రాజుభాయ్(25)కి ఖాతాలను అప్పగిస్తానని చెప్పాడు. రాజుభాయ్ దుబాయ్ న్యూసత్వాలోని ధనవంద్ రెసిడెన్స్‌లో ఉంటూ తరచూ భారత్‌కు రాకపోకలు సాగిస్తాడని తేలడంతో పోలీసులు లుక్‌అవుట్ నోటీస్ జారీ చేశారు. అతడు నేపాల్ మీదుగా రోడ్డు మార్గంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోనౌలికి చేరుకోగా ఇమిగ్రేషన్ సిబ్బంది పట్టుకొని హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి తీసుకొచ్చారు. అతడిని కస్టడీలో విచారించగా దుబాయ్ లింక్‌లు బయటపడ్డాయి.
దుబాయ్‌లో ఉంటున్న బెర్లిన్‌కు బ్యాంకు ఖాతాల రిజిస్టర్డ్ మెయిల్ ఐడీలు, ఎస్‌ఎంఎస్ అలర్ట్ మెసేజ్‌లను అందిస్తానని రాజుభాయ్ వెల్లడించాడు. ఇందుకోసం బెర్లిన్ నుంచి 20 శాతం కమీషన్ అందుతుందని చెప్పాడు. ఈ ముఠా సభ్యులు మొత్తం 47 బ్యాంకు ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడినట్లు, దేశవ్యాప్తంగా వీరిపై 507 కేసులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తెలంగాణలో 67 కేసులున్నాయి. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.44 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేయించారు. బాధితుడికి న్యాయస్థానం ద్వారా రూ.55 లక్షలను తిరిగి ఇప్పించారు. పరారీలో ఉన్న బెర్లిన్, రాజుభాయ్‌ల గురించి దుబాయ్ పోలీసులకు లెటర్ ఆఫ్ రోగెటోరీ ద్వారా సమాచారం ఇస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసం : మరోవైపు యూ-కాయిన్8 ప్లాట్‌ఫాం ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసం చేసిన కేసులో మంగిలాల్ గోదారా(36), భజన్‌లాల్(33), కమలేశ్‌కుమార్(29), ప్రకాశ్‌చంద్(32)ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన వీరంతా హైదరాబాద్‌లోని సుచిత్రలో ఉంటూ వాట్సప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇటీవలె హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడి దగ్గర ఈ ముఠా రూ.3.45 లక్షలు కాజేసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.
ఆరంభంలో కొంత మొత్తం లాభాలను ఇవ్వడం ద్వారా బాధితులతో నిందితులు భారీగా పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడినట్లు తేలింది. గోదారా, భజన్‌లాల్, ప్రకాశ్‌చంద్ నకిలీ గుర్తింపు పత్రాల ఆధారంగా తెరిచిన బ్యాంకు ఖాతాలను కమలేశ్‌కు రూ.లక్షకొకటి చొప్పున విక్రయించినట్లు తేలింది. 52 షెల్ కంపెనీలు సృష్టించిన ఈ ముఠా బాధితుల నుంచి కొట్టేసిన సొమ్మును వాటి ద్వారా కాజేసినట్లు వెల్లడైంది. అలా దేశవ్యాప్తంగా 92 నేరాల్లో మొత్తం రూ.16 కోట్లను ముఠా కొల్లగొట్టగా రూ.1.68 కోట్లను బ్యాంకు ఖాతాల్లో పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు కమిషనర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
పార్శిల్ పేరిట మోసం - బాధితుడి ఖాతా నుంచి రూ.20 లక్షలు స్వాహా - Cyber fraud in the name of parcel
స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలంటూ రూ. 3.30 కోట్లు కాజేసిన సైబర్ కేటుగాళ్లు - Stock Trading Cyber Crime