Hyderabad Metro Trains Time Extends :నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 25వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్(IPL 2024) మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, మిగతా మార్గాలలో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయన్నారు. ఇంతకీ, ఉప్పల్ మార్గంలో పొడిగించిన మెట్రో వేళలు ఏ టైమ్ నుంచి ఏ టైమ్ వరకు అందుబాటులో ఉంటాయి? ఏ ఏ స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడానికి వీలుంటుంది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైదరాబాద్ మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఉప్పల్ మార్గంలో ఏప్రిల్ 25 పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ తెలిపారు. అంటే.. ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.
అలాగే.. మిగతా మార్గాలలో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగుతాయన్నారు. అంటే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని చెప్పారు.