Hyderabad Man Murdered Wife : క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత దారుణమైన రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి, దంచి చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలో ఆ కిరాతకం చోటుచేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జేపీచెరువుకు చెందిన గురుమూర్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది. ఈనెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యభర్తల మధ్య తగాదా జరిగింది.
కేసు నుంచి తప్పించుకోవాలని ఘోరమైన పథకం : ఆ గొడవకు కారణాలేంటో తేలియలేదు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకువచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే మాధవి తలపై గురుమూర్తి రెండుసార్లు గట్టిగా కొట్టగా స్పృహతప్పి పడిపోయింది. అకస్మాత్తుగా కిందపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడు మరణించినట్లు భావించాడు. ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిలోని కిరాతకుడు బయటకొచ్చాడు.
కుక్కర్లో ఉడికించి, రోటీలో దంచి : నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడని తెలుస్తోంది. ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం. ఆ మొత్తాన్ని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్నగొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు.