తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 2:16 PM IST

ETV Bharat / state

మాకు రూ.97 వద్దు - రూ.72 చాలు - మేడిగడ్డ ఇసుక టెండర్లలో ఆసక్తికర పరిణామాలు - Medigadda Sand Auction

Medigadda Sand Loading Tenders : మేడిగడ్డ ఇసుక లోడింగ్​ టెండర్​ ప్రక్రియలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇసుక లోడింగ్‌కు రూ.97కు టీజీఎండీసీ టెండర్​ పిలవగా, గుత్తేదారులు కేవలం రూ.72.76కే పనులు చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని రీచ్‌లకు కలిపి తుది పరిశీలనలో 173 మంది ఉండగా, వారంతా ఒకేరకంగా రూ.72.76 కోట్‌ చేశారు.

Medigadda Sand Loading Tenders
Medigadda Sand Loading Tenders (ETV Bharat)

Medigadda Barrage Sand Auction Tenders : మేడిగడ్డ ఇసుక టెండర్లలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇసుక లోడింగ్​ టెండర్లు దక్కించుకునేందుకు వందల మంది కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. అర్హత పొందిన వారంతా, టీజీఎండీసీ నిర్దేశించిన అంచనా వ్యయం కంటే 25 శాతం తక్కువకే ఆర్థిక బిడ్లను దాఖలు చేశారు. ఒక్కో టన్ను ఇసుక లోడింగ్‌కు రూ.97 ఖర్చవుతుందని టీజీఎండీసీ అంచనా వేసింది. అందుకు కోసం టెండర్లు పిలిస్తే- గుత్తేదారులు మాత్రం మాకు అంత వద్దు, కేవలం రూ.72.76కే పనిచేసి పెడతామంటూ క్యూ కట్టారు. వాస్తవ ఖర్చు కంటే తక్కువకే ఇసుకను తవ్వి తీసి, లారీల్లో నింపేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. దీంతో బిల్లులో పేర్కొన్న పరిమాణం మేరకే లారీల్లో ఇసుక నింపడానికి పరిమితం అవుతారా? అక్రమాలకు తెరలేస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో 92,27,343.57 టన్నుల ఇసుకను విక్రయించేందుకు టీజీఎండీసీ మహదేవపూర్, బెగులూర్, బ్రాహ్మణపల్లి, ఎల్కేశ్వరం, బొమ్మాపూర్‌ ప్రాంతంలో 14 రీచ్‌ (బ్లాక్‌)లను గుర్తించింది. అందుకోసం టెండర్లు పిలిచింది. గోదావరిలో ఇసుకను తవ్వి సమీపంలో స్టాక్‌యార్డుకు తరలించాలి. అక్కడికి వచ్చే లారీల్లో ఇసుకను నింపడం గుత్తేదారుల పని. యంత్రాలు, మనుషులు, స్టాక్‌యార్డుకు అవసరమైన భూమి, లారీలకు పార్కింగ్, డ్రైవర్లకు కనీస సదుపాయాలు, వీటన్నింటినీ కల్పించే బాధ్యత గుత్తేదారులదే.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశం - SC Angry On Sand Mining In AP

అందుకోసం టన్ను ఇసుక లోడింగ్‌కు రూ.97 ఖర్చవుతుందని టీజీఎండీసీ అధికారులు అంచనా వేశారు. ఒక్కో రీచ్‌కు సగటున 27 మంది పోటీపడ్డారు. సాంకేతిక బిడ్ల పరిశీలన అనంతరం, ఆర్థిక బిడ్ల పరిశీలనకు రీచ్‌కు సరాసరి 12 మంది చొప్పున అర్హత సాధించారు. అందరికంటే తక్కువ కోట్‌ చేసిన వారిని ఎల్‌-1 గా గుర్తించి వారికి కాంట్రాక్ట్‌ అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే, ఇక్కడ అన్ని రీచ్‌లకు కలిపి తుది పరిశీలనలో 173 మంది పోటిపడగా, వారంతా ఒకేరకంగా 72.76 రూపాయలు కోట్‌ చేశారు. దీంతో ప్రతి రీచ్‌లోనూ పోటీలో ఉన్న 173 మంది ఎల్‌-1గా అధికారులు నిలిచారు.

మహదేవపూర్‌లో మొదటి 3 రీచ్‌లకు 14 మంది చొప్పున తుది పోటీలో ఉండగా, వారంతా 25 శాతం తక్కువకే కోట్‌ చేశారు. ఎల్‌-1గా నిలిచారు. ఎల్కేశ్వరం -2లో 13 మందికి అందరూ ఎల్‌-1గా ఉన్నారు. మిగతా రీచ్‌ల్లోనూ ఇదే స్థితి. దీంతో అందరి సమక్షంలో వీడియో తీస్తూ డ్రా పద్ధతిలో ఒక్కో రీచ్‌కి ఒక్కో గుత్తేదారుని ఎంపిక చేసినట్లు టీజీఎండీసీ అధికారి ఒకరు తెలిపారు. గుత్తేదారులకు శుక్రవారం ఎల్‌ఓఐ (లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌) ఇచ్చారు. స్టాక్‌యార్డుకు అవసరమైన భూమిని గుర్తించి, గుత్తేదారు, పట్టాదారు, టీజీఎండీసీ అధికారి ఒప్పందం కుదుర్చుకోవడమే తరువాయి. ఆ తర్వాత ఇసుక తవ్వకాలు మొదలవుతాయి.

ఇసుక లోడింగ్‌ సక్రమంగా జరిగేనా? : రీచ్‌ల్లో బిల్లు మేరకు కాకుండా గుత్తేదారులు ఒక్కో లారీలో ఏడెనిమిది టన్నుల ఇసుకను అక్రమంగా నింపుతున్నారు. తద్వారా భారీగా జేబులు నింపేసుకుంటున్నారు. దీనివల్ల గుత్తేదారుకు, లారీ యజమానులకు లబ్ధి చేకూరుతుంది. కానీ టన్నుకు రూ.410 చొప్పున ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. తాజా టెండర్లలో అంచనా ఖర్చు కంటే 25 శాతం తక్కువకే ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు బిల్లులో ఉన్నంత పరిమాణానికే ఇసుక నింపుతారా? ఇసుక లోడింగ్‌ ఖర్చులో నష్టాన్ని పూడ్చుకోవడంద్వారా భారీగా లబ్ధి పొందేందుకు అక్రమంగా ఇసుక నింపుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో ఇసుక టెండర్లకు ఆహ్వానం - వారం రోజులే గడువు

ABOUT THE AUTHOR

...view details